#NewsBytesExplainer: భారత్‌తో పాటు ఈ దేశాల్లోనూ పాస్‌పోర్ట్ పౌరసత్వాన్ని నిర్ధరించే పత్రం కాదు.. అవి ఏ దేశాలంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారత పాస్ పోర్ట్ కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే పత్రమేనని, దానిని పౌరసత్వానికి నిర్ధరించే పత్రంగా పరిగణించరాదని విదేశాంగశాఖ (MEA) తాజాగా స్పష్టం చేసింది. దీంతో సోషల్ మీడియాలో "పాస్‌పోర్టు కాకపోతే పౌరసత్వానికి ఆధారం ఏది?" అనే చర్చ మొదలైంది. భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న పాస్‌పోర్టు సేవలు, అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ అధికారులు ఈ వివరణ ఇచ్చారు. పాస్‌పోర్టులు భారతీయ పౌరులకే జారీ చేస్తారని, అయితే వాటి ప్రధాన ఉద్దేశం విదేశీ ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం, విదేశాల్లో వ్యక్తి గుర్తింపును నిర్ధారించడం మాత్రమేనని తెలిపారు.
వివరాలు
చాలా దేశాల్లో పౌరసత్వానికి సంబంధించిన ప్రత్యేక చట్టాలు
అయితే ఈ విధానం భారత్‌కే ప్రత్యేకం కాదు. ప్రపంచంలోని అనేక దేశాలు కూడా పాస్‌పోర్టును బలమైన ఆధారంగా పరిగణించినప్పటికీ, పౌరసత్వాన్ని నిర్ధారించే తుది పత్రంగా గుర్తించవు.
సాధారణంగా పాస్‌పోర్టు ప్రాథమిక ఆధారంగా మాత్రమే ఉపయోగపడుతుంది.
కొన్ని న్యాయ వివాదాలు, వారసత్వ పౌరసత్వ నిర్ధారణ, ప్రత్యేక ప్రభుత్వ ప్రక్రియల్లో అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
చాలా దేశాల్లో పౌరసత్వానికి సంబంధించిన ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయి.
జనన ధ్రువీకరణ పత్రాలు, పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు లేదా ఇతర అధికారిక రికార్డులకే తుది ఆధారంగా గుర్తింపు ఉంటుంది.
వివరాలు
కెనడా
కెనడాలో పాస్‌పోర్టును ప్రభుత్వ ప్రయోజనాలు లేదా ఇతర అధికారిక అవసరాలకు ప్రాథమిక పౌరసత్వ ఆధారంగా అంగీకరించరు.
అక్కడ జన్మించినవారు జనన ధ్రువీకరణ పత్రం, విదేశాల్లో జన్మించిన వారు లేదా పౌరసత్వం పొందిన వారు సిటిజన్‌షిప్ సర్టిఫికెట్ సమర్పించాలి.భారతదేశంలాగే అక్కడ కూడా పాస్‌పోర్టు ప్రధానంగా ప్రయాణ పత్రమే.
అమెరికా
అమెరికాలో పాస్‌పోర్టు అనేక సందర్భాల్లో పౌరసత్వానికి ప్రధాన ఆధారంగా ఉపయోగించినప్పటికీ, ప్రతి సందర్భంలో అది సరిపోదు.
ముఖ్యంగా తల్లిదండ్రుల ద్వారా లభించే పౌరసత్వాన్ని నిర్ధారించాలంటే అదనపు పత్రాలు అవసరం కావచ్చు.
వలస, ఓటింగ్ వంటి అంశాల్లో పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు లేదా నేచురలైజేషన్(పౌరసత్వం పొందినట్లు)సర్టిఫికెట్లను అధికారులు కోరే అవకాశం ఉంటుంది.
అందుకే జనన ధ్రువీకరణ పత్రాలు లేదా నేచురలైజేషన్ సర్టిఫికెట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
వివరాలు
ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలో పాస్‌పోర్టులు పౌరులకే జారీ చేస్తారు. అయినప్పటికీ కొత్త పాస్‌పోర్టు పొందేటప్పుడు లేదా పౌరసత్వంపై వివాదాలు తలెత్తినప్పుడు జనన ధ్రువీకరణ పత్రం లేదా సిటిజన్‌షిప్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 1986 తర్వాత జన్మించిన వారు తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు పౌరుడు లేదా శాశ్వత నివాసి అని నిరూపించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో పాస్‌పోర్టు ఒక్కటే సరిపోదు.
జర్మనీ
జర్మనీలో పాస్‌పోర్టు పౌరులకే జారీ చేసినప్పటికీ, ముఖ్యంగా వంశపారంపర్యంగా పౌరసత్వాన్ని నిర్ధారించాల్సి వచ్చినప్పుడు ప్రత్యేక పౌరసత్వ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. కుటుంబ వారసత్వానికి సంబంధించిన పూర్తి పత్రాలు కూడా అవసరం అవుతాయి. పాస్‌పోర్టు ఒక్కటే సరిపోదు.
వివరాలు
ఫ్రాన్స్
ఫ్రాన్స్‌లో పాస్‌పోర్టును అనేక సందర్భాల్లో అంగీకరించినప్పటికీ, దేశీయంగా పౌరసత్వాన్ని నిరూపించడానికి అధికారిక జాతీయ గుర్తింపు కార్డు (National Identity Card)కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
చైనా
చైనాలో దేశీయ లావాదేవీల కోసం జాతీయ గుర్తింపు కార్డునే పౌరసత్వం, గుర్తింపుకు అధికారిక పత్రంగా గుర్తిస్తారు. బ్యాంకు ఖాతా తెరవడం, ఆస్తులు కొనుగోలు చేయడం, స్థానిక ప్రయాణాలు వంటి వాటికి సాధారణంగా పాస్‌పోర్టును అంగీకరించరు.
పెరూ
లాటిన్ అమెరికా దేశమైన పెరూలో ప్రతి పౌరుడికి జాతీయ గుర్తింపు పత్రం (DNI) తప్పనిసరి. ప్రభుత్వ సేవలు పొందడం లేదా రోజువారీ అధికారిక కార్యకలాపాలకు పాస్‌పోర్టు ప్రత్యామ్నాయంగా పరిగణించబడదు.
వివరాలు
పాస్‌పోర్టు కేవలం ప్రయాణ పత్రమే..
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పాస్‌పోర్టు పౌరసత్వానికి ప్రాథమిక ఆధారం మాత్రమే. తుది నిర్ధారణ పత్రం కాదు.
పొరపాటున జారీ కావడం, మోసపూరితంగా పొందడం లేదా కోర్టుల్లో సవాలు ఎదురవడం వంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.
అందుకే అనేక దేశాలు జనన రికార్డులు, ప్రత్యేక పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు లేదా ఇతర అధికారిక పత్రాలనే తుది ఆధారాలుగా పరిగణిస్తాయి.
ఈ నేపథ్యంలో పాస్‌పోర్టు కేవలం ప్రయాణ పత్రమేనని భారత్ స్పష్టం చేయడం కొత్త విషయం కాదని నిపుణులు చెబుతున్నారు.