ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం భారీగా నిధులను తగ్గించాదన్నారు. గత కొంతకాలంగా ఉపాధి హామీ పథకానికి కేంద్రం నిధులను తగ్గిస్తూ వస్తోందన్నారు కవిత. 2020-21లో రూ.1,10,000 కోట్లు కేటాయించగా, 2021-22లో రూ. 98,000 కోట్లు, 2022-23లో రూ. 89,400 కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఏడాది రూ.60,000 కోట్లకు తగ్గించినట్లు పేర్కొన్నారు.
ఉపాధి హామీ కోసం రూ. 2.72 లక్షల కోట్లను కేటాయించాలి: కవిత
ఉపాధి హామీ కోసం కేంద్రం కనీసం రూ. 2.72 లక్షల కోట్లను కేటాయించాలని ఎమ్మెల్సీ కె.కవిత డిమాండ్ చేశారు. గత తొమ్మిదేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి కొత్త ఉపాధి అవకాశాలను కల్పించలేదన్నారు. ప్రస్తుతం ఉన్న ఉపాధి కార్యక్రమాలను కూడా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వీలైనంత వరకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రాలకు సహకరించడం లేదన్నారు.