
Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్టులో మరో కీలక పరిణామం.. వెడల్పు 140 మీటర్లకు పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణను 140 మీటర్ల వెడల్పుతో చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ప్రాథమికంగా 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేపట్టాలని ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదించినా,భవిష్యత్‌లో రహదారి విస్తరణ,రైల్వే మార్గాల అభివృద్ధి తదితర అవసరాలను దృష్టిలో పెట్టుకుని 150 మీటర్లకు భూసేకరణ పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
ఈ క్రమంలో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపేందుకు కేంద్రం ఇటీవల అంగీకరించింది.
అంతేకాక, ఓఆర్‌ఆర్ ప్రక్కన ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.
వివరాలు
భూసేకరణపై ప్రాథమిక ప్రతిపాదనలు
దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) నుంచి జారీ కానున్నాయి.
2018లో అమరావతి ఓఆర్‌ఆర్ ప్రతిపాదనల ప్రకారం,150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రహదారి విస్తరణతో పాటు, భవిష్యత్‌లో సబర్బన్ రైలు మార్గాల ఏర్పాటుకు కూడా వీలుగా భూసేకరణ జరపాలని ఆలోచించారు.
అయితే ఇటీవల 189.4 కి.మీ. పొడవైన 6 వరుసల ఓఆర్‌ఆర్ నిర్మాణానికి మోర్త్‌లోని ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక అనుమతిని ఇచ్చింది.
అయితే, భూసేకరణను కేవలం 70 మీటర్లకు మాత్రమే పరిమితం చేయాలని పేర్కొంది.
వివరాలు
సర్వీసు రోడ్ల నిర్మాణానికి కేంద్ర సమ్మతి
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి, భవిష్యత్‌లో ఓఆర్‌ఆర్‌ను 10 వరుసలుగా విస్తరించాల్సి వస్తుందని, అప్పుడు కొత్త భూమి సేకరణ చేయడం మరింత క్లిష్టతరం అవుతుందని కేంద్రాన్ని సమర్థంగా వివరించారు.
దీంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు.
తొలుత, ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఓఆర్‌ఆర్‌కు కేవలం లోపలివైపు (రాజధాని వైపు)మాత్రమే సర్వీసు రోడ్లను నిర్మించేందుకు అనుమతినిచ్చింది.
అయితే, బయటివైపు సర్వీసు రోడ్ల అవసరం లేదని పేర్కొంది. దీనిపై కూడా చంద్రబాబు కేంద్ర మంత్రిని కలిసి చర్చలు జరిపారు.
ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా సర్వీసు రోడ్లు ఉంటేనే రహదారి అనుకుని ఉన్న గ్రామాలు,పట్టణాల ప్రజలు సులభంగా ప్రయాణించగలరని వివరించారు.
వివరాలు
ప్రాజెక్టు వ్యయాన్ని పెంచనున్న భూసేకరణ
దీనికి కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకరించి, ఇరువైపులా సర్వీసు రోడ్లను నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రస్తుతం ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదించిన విధంగా ఓఆర్‌ఆర్ నిర్మాణానికి రూ.16,310 కోట్లు వ్యయమవుతుందని అంచనా.
ఇందులో సివిల్ పనులకు రూ.12,955 కోట్లు కేటాయించనున్నారు. ప్రాథమికంగా 70 మీటర్ల వెడల్పుతో 1,702 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉండగా,దీని కోసం రూ.2,665 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అయితే, ఇప్పుడు భూసేకరణ వెడల్పు 140 మీటర్లకు పెరగడంతో ఖర్చు మరింతగా పెరిగే అవకాశముంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మోర్త్ ఉన్నతాధికారులు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.