Page Loader
Sheeshmahal: ఢిల్లీ 'శీష్ మహల్‌'పై విచారణకు ఆదేశించిన కేంద్రం
ఢిల్లీ 'శీష్ మహల్‌'పై విచారణకు ఆదేశించిన కేంద్రం

Sheeshmahal: ఢిల్లీ 'శీష్ మహల్‌'పై విచారణకు ఆదేశించిన కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 15, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన 'శీష్ మహల్' (Sheeshmahal) వివాదాస్పదంగా మారింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శీష్ మహల్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా కీలక నిర్ణయం తీసుకుని బంగ్లాపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

వివరాలు 

నివేదిక ఆధారంగా కేంద్రం విచారణకు ఆదేశాలు 

కేంద్ర ప్రజాపనుల విభాగం నివేదికను సమర్పించిన అనంతరం, ఫిబ్రవరి 13న సమగ్ర విచారణకు ఆదేశాలు ఇచ్చింది. 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లో ఉన్న 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఈ అధికార నివాసాన్ని ఆధునీకరించడంలో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపి వివరమైన నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

వివరాలు 

'శీష్ మహల్' వివాదంలో భారీ ఆరోపణలు 

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన అధికారిక నివాసంగా సివిల్ లైన్స్‌లో ఉన్న బంగ్లా ఉపయోగించుకున్నారు. అయితే, బీజేపీ ఈ అధికార నివాసాన్ని 'శీష్ మహల్'గా అభివర్ణించింది. దాదాపు రూ.80 కోట్ల ప్రజాధనంతో ఈ నివాసాన్ని పునరుద్ధరించారని, లగ్జరీ మార్పులు చేశారని ఆరోపించింది. ఆధునీకరణలో భాగంగా గోల్డెన్ కమోడ్‌, స్విమ్మింగ్ పూల్‌, మినీ బార్‌ వంటి ఫ్యాన్సీ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఈ పునరుద్ధరణ కుంభకోణంగా మారిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి.

వివరాలు 

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం 

ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. 70 స్థానాలకు గానూ బీజేపీ ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించగా, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు, మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్‌ వంటి కీలక నేతలు ఓడిపోవడం ఆ పార్టీకి కఠిన పరీక్షగా మారింది. కీలక నేతల్లో ఆతిశీ మాత్రమే గెలుపొందడం ఆప్‌కు కొంత ఊరటనిచ్చింది.