LOADING...
Polavaram: పోలవరానికి మరో రూ.2,705 కోట్ల అడ్వాన్స్‌.. కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖల పచ్చజెండా
పోలవరానికి మరో రూ.2,705 కోట్ల అడ్వాన్స్‌.. కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖల పచ్చజెండా

Polavaram: పోలవరానికి మరో రూ.2,705 కోట్ల అడ్వాన్స్‌.. కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖల పచ్చజెండా

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2025
08:33 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.2,705 కోట్లు అడ్వాన్స్‌గా విడుదల చేయడానికి అంగీకరించింది. త్వరలో ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు చేరుకుని, అక్కడి నుంచి సింగిల్‌ నోడల్‌ ఖాతాకు బదిలీ కానున్నాయి. తాజా విడుదలతో కలిపి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొత్తం రూ.5,512కోట్లు విడుదల చేసినట్లయింది. ఇందులో రూ.5,048 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించిన నిధులే. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన 2014 తర్వాత,ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత పెద్ద మొత్తంలో కేంద్రం నిధులు విడుదల చేయలేదు. గతంలో,రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చు చేసిన తర్వాత కేంద్రం రీయింబర్స్‌ చేయడం ఆనవాయితీగా ఉండేది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్లకు పైగా నిధులు ముందుగా మంజూరు చేయడం గమనార్హం.

వివరాలు 

మునుపు మంజూరైన నిధులు 

కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు అధికారంలో ఉండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. పోలవరం అధికారులు కూడా ఇంత వేగంగా నిధులు మంజూరు కావడం ఇదే తొలిసారి అని అంటున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రూ.12,157 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్‌గా విడుదల చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ తర్వాత రూ.2,807 కోట్లు విడుదల చేయగా, అందులో రూ.2,348 కోట్లు పూర్తిగా అడ్వాన్స్‌ నిధులే. కేంద్రం నిర్ణయం ప్రకారం, ఈ నిధులలో 75% ఖర్చు చేసిన తర్వాత ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే మరో విడత నిధులు విడుదల చేస్తారు. ఈ ప్రక్రియకు అనుగుణంగా,రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులు,పునరావాస వ్యయాలు చెల్లించి ధ్రువీకరణ పత్రాలు సమర్పించింది.

వివరాలు 

అనుమతుల ప్రక్రియలో మార్పులు 

దాంతో, తాజా విడతగా రూ.2,700 కోట్లను అడ్వాన్స్‌గా మంజూరు చేసే దిశగా చర్యలు చేపట్టారు. రెండో విడతగా రూ.2,705 కోట్ల అడ్వాన్స్‌ కోసం పోలవరం అధికారులు, అథారిటీ, కేంద్ర జలశక్తి శాఖలు సిఫార్సు చేసినా, ఆర్థికశాఖలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మొదట రూ.1,300 కోట్లను మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమంత్రులతో చర్చించిన తర్వాత ఈ ఫైలు మళ్లీ జలశక్తి శాఖకు చేరింది. తదుపరి పరిశీలనలో రూ.2,705 కోట్ల మొత్తాన్ని విడుదల చేయాలని కేంద్రం తుది నిర్ణయం తీసుకుంది. ఈ వారంలోనే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు చేరుతాయి.

వివరాలు 

పోలవరం ప్రాజెక్టుపై వరుస భేటీలు 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం నిధులు పోలవరానికి విడుదలైనట్లే. ఇక, 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.5,936 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. ప్రస్తుతం మంజూరైన నిధులలో 75% ఖర్చు చేసి ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే, ఏప్రిల్‌ తర్వాత కొత్త నిధులను పొందే అవకాశముంటుంది. పోలవరం పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించేందుకు కేంద్ర,రాష్ట్ర అధికారులు వరుస భేటీలను ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 18న, కేంద్ర జలసంఘం డిజైన్ విభాగం డైరెక్టర్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

వివరాలు 

మార్చి 27న ప్రత్యేక సమావేశం 

అలాగే, కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమక్షంలో ఒక ముందస్తు సమావేశం కూడా జరుగుతుంది. మార్చి 17న, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించనుంది. అంతేగాక, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంతర్రాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో, సుప్రీంకోర్టులో ఉన్న కేసు పరంగా తెలంగాణకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు మార్చి 27న ప్రత్యేక సమావేశాన్ని పోలవరం అథారిటీ నిర్వహించనుంది.