జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశాం: చంద్రబాబు, పవన్
భోగిని పురస్కరించుకొని 'తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం' పేరుతో అమరావతి రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో వేడుకలను నిర్వహించారు. ఈ సంబరాలకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు భోగి మంటలు వెలిగించారు. ఆ మంటల్లో వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులను వేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందని, ఇంకా 87రోజులే మిలిగినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరబట్టారని మండిపడ్డారు. రాజధాని రైతులు అడుగడుగునా అవమానాలను ఎదుర్కొన్నారన్నారు.
నాలుగేళ్లుగా ఏపీకి ఓ పీడ పట్టుకుంది: పవన్ కళ్యాణ్
అమరావతి రాజధాని ప్రాంతంలో సంక్రాంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. అమరావతి రాజధాని కోసం అందరూ 'సంక్రాంతి సంకల్పం' చేయాలన్నారు. వైసీపీ తీసుకొచ్చిన చీకటి జీవోలను భోగి మంటల్లో తగులబెట్టామని చంద్రబాబు చెప్పారు. అనంతరం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ఏపీకి పీడ పట్టుకుందన్నారు. అలాంటి కీడును, పీడను నేడు భోగి మంటల్లో వేసి తగలబెట్టేశామన్నారు. అమరావతి రైతులు, ప్రజల ఆకాంక్షల కోసమే తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పని చేస్తున్నట్లు పవన్ చెప్పారు. ఏ ఉద్దేశంతో రాజధానికి భూములు ఇచ్చారో.. దాన్ని నెరవేర్చేందుకు టీడీపీ, జనసేన కృషి చేస్తాయని హామీ ఇచ్చారు. ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వేస్తే ఏపీ భవిష్యత్తు చీకటిమయం అవుతుందని పవన్ దుయ్యబట్టారు.