Page Loader
Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు.. హోటల్స్‌కు క్యూ కడుతోన్న టెకీలు,ధనవంతులు
చెన్నైలో భారీ వర్షాలు.. హోటల్స్‌కు క్యూ కడుతోన్న టెకీలు,ధనవంతులు

Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు.. హోటల్స్‌కు క్యూ కడుతోన్న టెకీలు,ధనవంతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2024
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. గురువారం ఉదయం నెల్లూరు, తడ మధ్య తీరం దాటినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అల్పపీడనం బలహీనపడి గంటకు 22 కి.మీ. వేగంతో తీరం దాటిందని, దీని ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తమిళనాడు రాజధాని చెన్నై నగరం గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో చిగురుటాకులా వణికిపోతోంది. అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రత్యేకించి ఐటీ ఉద్యోగులు,చాలా మంది ధనవంతులు ముందజాగ్రత్తగా విలాసవంతమైన హోటళ్లలో గదులు బుక్ చేసుకుని కుటుంబాలతో కలిసి అక్కడకు వెళ్లిపోతున్నారు.

వివరాలు 

గదికి రూ.8 వేల వరకు ఛార్జ్ 

గతేడాది డిసెంబరులో కూడా భారీ వర్షాలు ముంచెత్తి ఇళ్లలోకి వరద నీరు చేరి, కార్లు కొట్టుకుపోయాయి. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా హోటల్స్‌కు క్యూకడుతున్నాయి. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక వసతి, తాగునీరు, విద్యుత్‌ సరఫరా, వైఫై వంటి అవసరాలను గదుల బుకింగ్‌లో షరతులుగా పేర్కొంటున్నారు. ఈ సౌకర్యాలతో ఉన్న ఒక్కో గదికి రూ.8 వేల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గురువారం కూడా భారీ నుంచి అతిభారీ వర్ష హెచ్చరికలు జారీ చేశారు. అయితే, బుధవారం రెడ్‌ ఎలర్ట్‌ జారీచేయడం వల్ల సాయంత్రం వరకు తేలికపాటి జల్లులు కురువడంతో చెన్నై ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

వివరాలు 

రజనీకాంత్‌ ఇంటి ఆవరణలో వరదనీరు

మంగళవారం కురిసిన అత్యంత భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రముఖుల ఇళ్లను వరద ముంచెత్తింది. చెన్నై పోయెస్‌గార్డెన్‌ ప్రాంతంలో సినీనటుడు రజనీకాంత్‌కు చెందిన ఇంటి ఆవరణలో వరదనీరు చేరింది. వాయుగుండం తీరం దాటినా, శుక్రవారం ఉదయం వరకు చెన్నైలో భారీ, అతిభారీ వర్షాలకు అవకాశముందని ఐఎండీ సూచించింది. చెన్నై జిల్లా సహా చుట్టుపక్కల 9 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత 20 వరకు అన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని ప్రకటించారు.

వివరాలు 

బెంగళూరు నగరంలో స్తంభించిన జనజీవనం 

దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరాన్ని కూడా భారీ వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించింది. ఐటీ, బీటీ కేంద్రాలకు నిలయమైన మాన్యత టెక్‌పార్కు ఆవరణలో నూతన నిర్మాణాల కోసం తీసిన పునాదుల్లో మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. బెంగళూరు ఇందిరానగర్‌ సమీప మెట్రో మార్గంపై ఓ చెట్టు కూలడంతో కొంత సమయం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర, కోలారు, రామనగర, మైసూరు, చామరాజనగర, ఉడుపి, మంగళూరు, ఉత్తర కర్ణాటక, చిత్రదుర్గ తదితర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.