Cherlapally Railway Terminal: హైదరాబాద్ మహానగర సిగలో మరో మణిపూస.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
హైదరాబాద్ మహానగర రైల్వే గౌరవానికి మరొక అందమైన నగలుగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిలవనుంది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ టెర్మినల్‌ను డిసెంబర్ 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ టెర్మినల్‌లో ప్రయాణికులకు ఉచిత వైఫై సహా అనేక ఆధునిక సౌకర్యాలను కల్పించారు. మొత్తం 9 ప్లాట్‌ఫాంలు, 2 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, 6 ఎస్కలేటర్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ఏసీ, నాన్-ఏసీ గదులు, రిజర్వేషన్ కౌంటర్లు, ఇరువైపులా టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
50,000 మంది ప్రయాణికుల రాకపోకలు సులభతరం
టెర్మినల్ ప్రారంభమైన తరువాత, 25 జతల రైళ్లు ఇక్కడి నుంచి నడుస్తాయి.దీని ద్వారా రోజుకు సుమారు 50,000 మంది ప్రయాణికుల రాకపోకలు సులభతరంగా సాగవచ్చు. ప్రస్తుతం ఇక్కడ 13 జతల రైళ్లు ఆగుతుండగా, ముఖ్యంగా కాగజ్‌నగర్ ఇంటర్‌సిటీ, కృష్ణా ఎక్స్‌ప్రెస్, గుంటూరు ఇంటర్‌సిటీ,మిర్యాలగూడ ఎక్స్‌ప్రెస్,శబరి ఎక్స్‌ప్రెస్,శాతవాహన వంటి రైళ్లు ఉన్నాయి. కొత్తగా 25 జతల రైళ్లు ప్రారంభమైతే నాంపల్లి,కాచిగూడ,సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. అదనంగా,సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు వేగం చేకూరే అవకాశం ఉంటుంది. నగర శివార్లలోని లింగంపల్లి నుంచి రైళ్లు సికింద్రాబాద్‌కు వెళ్లకుండా సనత్‌నగర్,అమ్ముగూడ మీదుగా చర్లపల్లి టెర్మినల్‌కు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టెర్మినల్ ప్రారంభానికి ముందు,స్టేషన్‌కు వెళ్లే రహదారులను విస్తరించి,ప్రజారవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని ప్రయాణికుల సంఘాలు కోరుతున్నాయి.