
Stray Dogs: వీధి కుక్కలపై సుప్రీం తీర్పు.. పునఃపరిశీలిస్తామన్న సీజేఐ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలోని అన్ని వీధి కుక్కలను(Stray Dogs)తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై దేశవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ తీర్పు వివరాలను తాను సమీక్షిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రకటించారు. రేబిస్ కేసులు, వీధి కుక్కల దాడుల వల్ల దిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో మరణాల సంఖ్య పెరుగుతోందన్న వార్తలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పార్దివాలా,జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం.. 8వారాల్లోపు అన్ని వీధి కుక్కలను ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దిల్లీ పరిధిలో ఎక్కడా వీధి కుక్కలు కనిపించకూడదని పేర్కొంది. ఈ చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేసే ఏ సంస్థ అయినా కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
వివరాలు
ఇంత భారీ ఖర్చును భరించే స్థోమత దిల్లీ ప్రభుత్వానికి ఉందా?: మేనకా గాంధీ
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ వాదనలనే వింటామని, జంతు ప్రేమికులు లేదా ఇతర సంస్థలు, పార్టీల నుంచి వచ్చే పిటిషన్లను విచారించబోమని కూడా స్పష్టం చేసింది. ఈ తీర్పుపై జంతు హక్కుల సంస్థలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశాయి. కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం ఆచరణ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. "దిల్లీలో సుమారు 3 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. వీటిని ఉంచేందుకు కనీసం 3 వేల షెల్టర్లు అవసరం. వీటి నిర్మాణానికి సుమారు రూ.15 వేల కోట్లు అవసరం అవుతుంది. ఇంత భారీ ఖర్చును భరించే స్థోమత దిల్లీ ప్రభుత్వానికి ఉందా?" అని ప్రశ్నించారు.
వివరాలు
తీర్పుపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈ తీర్పుపై విమర్శలు గుప్పించారు. "దశాబ్దాలుగా మనం అనుసరిస్తున్న మానవీయ, శాస్త్రీయ విధానాలకు ఇది వెనకడుగు వేసినట్లే. అన్ని వీధి కుక్కలను ఒక్కసారిగా తొలగించాలన్న ఆదేశం అమానవీయమైనది" అని అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీతో పాటు ప్రముఖ సినీ నటులు జాన్ అబ్రహాం, జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ ఆనంద్, అడివి శేష్ తదితరులు కూడా వీధి కుక్కల సంరక్షణపై తమ స్పందనను వెల్లడించారు.