Page Loader
Amaravati : రాజధాని అమరావతి రెండోదశ ప్రాజెక్టు కోసం 40-45 వేల ఎకరాలు భూసమీకరణ.. మంత్రి నారాయణ వెల్లడి 
రాజధాని అమరావతి రెండోదశ ప్రాజెక్టు కోసం 40-45 వేల ఎకరాలు భూసమీకరణ.. మంత్రి నారాయణ వెల్లడి

Amaravati : రాజధాని అమరావతి రెండోదశ ప్రాజెక్టు కోసం 40-45 వేల ఎకరాలు భూసమీకరణ.. మంత్రి నారాయణ వెల్లడి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం సుమారు 40 నుంచి 45 వేల ఎకరాల భూమిని భూసమీకరణ ద్వారా సమీకరించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. మొదటి దశలో అమలైన 217 చ.కి.మీ. పరిధిలోని భూసమీకరణ నిబంధనలనే రెండో దశలోనూ అనుసరించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌, మరొక 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్‌ సిటీని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.

వివరాలు 

మూడేళ్లలో భూములిచ్చే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు 

ఈ భూములను భూసమీకరణ ద్వారా తీసుకోవాలా, లేక భూసేకరణ చేయాలా అనే విషయంపై తుది నిర్ణయానికి రాకముందు, స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్లు తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 26,000 ఎకరాలు, తాడికొండ నియోజకవర్గంలోని మూడు గ్రామాల్లో 12,000 ఎకరాలు కలిపి మొత్తం 38,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా భూసమీకరణకు సమర్పించేందుకు ముందుకొచ్చారని వెల్లడించారు. రెండో దశలో భూములిచ్చే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు మూడేళ్లలో అందజేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీయే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నారాయణ మీడియా సమావేశంలో వివరించారు. రాజధానిలో ఏర్పాటయ్యే విద్యా, వైద్య సంస్థలకు భూముల రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపుని అథారిటీ ఆమోదించిందని చెప్పారు.

వివరాలు 

విమానాశ్రయం, స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌, స్పోర్ట్స్‌ సిటీలు నిర్మించాలంటే 10,000 ఎకరాలు

నారాయణ చెప్పిన ప్రకారం, భూసమీకరణ ద్వారా తీసుకునే భూమిలో రైతులకు కేటాయించే ప్లాట్ల తర్వాత సీఆర్డీయేకు మిగిలేది కేవలం 25 శాతమే. విమానాశ్రయం, స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌, స్పోర్ట్స్‌ సిటీలు నిర్మించాలంటే 10,000 ఎకరాలు అవసరం. అందుకోసం మొత్తం 40,000 ఎకరాలు భూసమీకరణ చేయాల్సి ఉంటుంది. మౌలిక వసతుల కోసం మరో 3 నుంచి 5 వేల ఎకరాలు కావాలన్నది అంచనా. దీంతో కలిపి మొత్తం 45,000 ఎకరాల అవసరం ఉందన్నారు. భూసేకరణ చేస్తే అవసరమైన 10,000 ఎకరాలు తీసుకుంటే చాలు కానీ, అది రైతులకు నష్టం కలిగిస్తుందన్నారు. అందుకే భూసమీకరణ విధానానికే ప్రాధాన్యం ఇస్తున్నామని, గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందని చెప్పారు. మరో 15 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని తెలిపారు.

వివరాలు 

స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ కోసం 2,500 ఎకరాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు కోసం 5,000 ఎకరాలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో విమర్శలు వచ్చినా, బేగంపేట విమానాశ్రయం చాలని కొందరన్నారు. కానీ ఇప్పుడా స్థాయి విమానాలు అక్కడ దిగలేవని,పెట్టుబడులు రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని, అందుకే అమరావతిలో కూడా 5,000 ఎకరాల ఎయిర్‌పోర్టు నిర్మించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. రాజధాని నిర్మాణానికి మొదటి దశలో భూసమీకరణలో తీసుకున్న 34,000 ఎకరాల భూమికి విలువ పెరగాలంటే స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ అవసరమని చెప్పారు. వీటి కోసం 2,500 ఎకరాలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

వివరాలు 

 స్పోర్ట్స్‌ సిటీ కోసం 2,500 ఎకరాలు 

అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్‌ సిటీ అభివృద్ధి చేస్తే, సంవత్సరానికి రెండు మూడు మెగా ఈవెంట్లు జరగొచ్చని, తద్వారా హోటల్స్, సేవా రంగం అభివృద్ధి చెంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో స్పోర్ట్స్‌ సిటీ కోసం 120 ఎకరాలు మాత్రమే మొదట కేటాయించినా, ఇప్పుడు ఒలింపిక్స్ స్థాయిలో సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో 2,500 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కృష్ణానదికి అటుపక్కనున్న లంక గ్రామాల్లో స్థలాలు పరిశీలించినా, నీటిలో మునిగే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం-హైదరాబాద్ హైవేపై స్థలాలు పరిశీలిస్తున్నామని తెలిపారు.

వివరాలు 

న్యాయపరమైన  సమస్యలు తొలిగాయి 

217 చ.కి.మీ. పరిధిలో రాజధాని నిర్మాణం పూర్తికాకముందే మరోసారి భూసమీకరణ చేయడంపై రైతులలో ఆందోళన ఉన్న విషయంపై స్పందిస్తూ, 2014-19 మధ్య భూసమీకరణ విధానం రూపకల్పనకు ఎక్కువ సమయం పట్టిందన్నారు. మాస్టర్‌ప్లాన్‌కు 6 నెలలు, లేఅవుట్ ప్లానింగ్‌కు 6 నెలలు, మాకీ సంస్థ రూపొందించిన రూపకల్పనల తర్వాత మరోసారి టెండర్లు పిలవాల్సి రావడం వల్ల మరిన్ని నెలలు గడిచాయని చెప్పారు. అన్ని టెండర్లు 2018-19 మధ్యనే పిలవడం జరిగిందని, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు. న్యాయపరమైన అన్ని సమస్యలు తొలగిపోయాయని, దాదాపు అన్ని పనులకు టెండర్లు పూర్తయ్యాయని, తదుపరి నాలుగేళ్లలో మూడు సంవత్సరాల్లో అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

వివరాలు 

రూ.3,673.44 కోట్ల విలువైన టెండర్లకు అథారిటీ ఆమోదముద్ర

అదనంగా స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ అభివృద్ధి వల్ల మొదటి దశలో భూములు ఇచ్చిన రైతుల స్థలాలకు విలువ మరింత పెరుగుతుందని తెలిపారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్ల నిర్మాణానికి రూ.3,673.44 కోట్ల విలువైన టెండర్లకు అథారిటీ ఆమోదముద్ర వేసినట్లు నారాయణ తెలిపారు. ఇందులో సీఎం కార్యాలయం ఉండే జీఏడీ టవర్‌కు రూ.882 కోట్లు (ఎన్‌సీసీ), 1,2 టవర్లకు రూ.1,487 కోట్లు (షాపూర్‌జీ పల్లోంజీ), 3,4 టవర్లకు రూ.1,303 కోట్లు (ఎల్ అండ్ టీ) టెండర్లు ఖరారు చేసినట్లు వివరించారు. రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ కన్సార్షియంను ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ గత వైకాపా ప్రభుత్వం వాళ్లను వెళ్లగొట్టడంతో పాటు, సింగపూర్‌ వెళ్లి మరీ విచారణ చేశారని, దీంతో వారు భయపడుతున్నారని చెప్పారు.

వివరాలు 

జగన్‌  అభిప్రాయాలు నిరాధారం

సింగపూర్‌ కన్సార్షియం కొనసాగించి ఉంటే రూ.2,000 కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు వచ్చేవని తెలిపారు. వారు రాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. రాజధాని నిర్మాణాలపై అవినీతి ఆరోపణలు చేస్తున్న జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, 23 మంది సీఈల కమిటీ ఆమోదించిన SSR రేట్లనే ఖరారు చేస్తున్నామని నారాయణ స్పష్టం చేశారు. జగన్‌ తన అభిప్రాయాలు నిరాధారంగా చెబుతున్నారని, ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నారు.