
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన.. మహిళపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం!
ఈ వార్తాకథనం ఏంటి
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని నారాయణపురంలో ఒక మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన అమానుష ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈఘటనపై కఠినంగా స్పందించిన సీఎం,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా పోలీస్ యంత్రాంగం చురుగ్గా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. బాధితమహిళ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు. ఈఘటనకు సంబంధించి ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఎంకు చిత్తూరు జిల్లా ఎస్పీ ఫోన్ ద్వారా తెలియజేశారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో,జిల్లా ఎస్పీతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం.
వివరాలు
ఘటన వివరాలు ఇలా ఉన్నాయి:
నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు భారం మితిమీరడంతో తిమ్మరాయప్ప ఊరు వదిలి వెళ్లిపోయాడు.తిమ్మరాయప్ప భార్య శిరీష తన పుట్టింటి ప్రాంతమైన శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ,జీవనోపాధి కోసం బెంగళూరులో కూలి పనులు చేస్తూ కుమారుడిని పోషిస్తోంది. సోమవారం రోజు,శిరీష తన కుమారుడి టీసీ కోసం నారాయణపురం పాఠశాలకి వచ్చింది. అదేసమయంలో మునికన్నప్ప,అతని భార్య మునెమ్మ,కుమారుడు,కోడలు కలిసి ఆమెను అడ్డగించి అప్పు విషయమై వాగ్వాదానికి దిగారు. అనంతరం శిరీషను చెట్టుకుకట్టి ఆమెపై దాడికి పాల్పడ్డారు.ఈవిషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మహిళను విడిపించారు. శిరీష ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు ప్రారంభించారు.