Page Loader
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. సీఆర్డీఏ ఆథారిటీ చర్చించిన అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్..
నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక సమావేశం.. సీఆర్డీఏ ఆథారిటీ చర్చించిన అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అమరావతి రాజధాని రెండవ దశ భూసేకరణపై సమీక్ష నిర్వహించి, తుదినిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి పునఃనిర్మాణ పనులను ప్రారంభించే సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, ఇతర సంబంధిత అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది.

వివరాలు 

CRDAకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

అంతేకాక, సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశంలో ఆమోదించిన పలు పనులకు మంత్రివర్గం నుంచి ఆమోదం పొందనుంది. ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో ఉన్న జరీబు భూముల రైతులకు తిరిగి ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి మంత్రివర్గ అథారిటీ నుంచి ఆమోదం లభించనుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA)కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిలో నిర్మించబోయే హైకోర్టు, శాసనసభ భవనాలకు సంబంధించి టెండర్లను పొందిన సంస్థలకు "లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్" (LOA) జారీ చేయడానికి అనుమతి ఇచ్చే అవకాశముంది.

వివరాలు 

ADCకి రూ.473 కోట్ల రూపాయలు మంజూరు

సీఆర్డీఏ నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్థ (ADC)కు రూ.473 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సహక మండలి (SIPB) సమావేశంలో ఆమోదించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, SIPB ఇప్పటికే ఆమోదించిన రూ.30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాల సృష్టికి సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ అనుకూలత తెలపనుంది. అంతేకాక, ఐటీ రంగానికి చెందిన సంస్థలకు తక్కువ ధరలకే భూములను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.