CM Jagan: జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై.. ఏపీ సీఎంకి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి,సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. సీఎం బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసులో పదేళ్లుగా జగన్ బెయిల్ పై ఉన్నట్లు కోర్టుకి తెలిపిన రఘురామకృష్ణ రాజు ఈ కేసులపై విచారణనను వేగవంతం చేయాలని కోరారు.
బెయిల్ రద్దు పిటీషన్ తో బాటు బదిలీ పిటిషన్ జత చెయ్యాలన్న ధర్మాసనం
జగన్ బెయిల్‌పై సీబీఐ, ఈడీ కనీసం సవాలు చేయలేదని రఘురామ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడంతో విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అంటూ ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చిన అనంతరం ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది కోర్టును కోరారు. జగన్ కేసులు దిల్లీకి బదిలీ చేయాలన్న పిటిషన్ తో పాటు బెయిల్ రద్దు పిటీషన్ ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.