Revanth Reddy:జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీ.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎప్పుడెప్పుడా అని ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నిజమైంది. నిజాయితీతో సమాజం కోసం పని చేసే ఆ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. జవహార్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇళ్ల స్థలాల పట్టాలను విడుదల చేసింది. ఈ సందర్భంగా,హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో,సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 1100మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు అందజేశారు. బషీర్‌బాద్‌లో 38ఎకరాల భూమిపత్రాలను కూడా ప్రభుత్వం అందజేసింది.ఈ సొసైటీలో చేర్చబడిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు క్రమం ఏళ్లుగా కోర్టులో విచారణలో ఉండగా,నేటికి వారి కల నెరవేరింది. అయితే, ఈ సొసైటీలో కొందరు జర్నలిస్టులు మరణించటం బాధాకరం.
మీడియాపై కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుత మీడియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు చాలా మీడియా సంస్థలు ఉన్నాయని,వాటిలో ఎక్కువగా రాజకీయ నేతలకు పనిచేసేవేనని ఆయన అభిప్రాయపడ్డారు. నిజమైన జర్నలిస్టులు ఎవరో ఎలా గుర్తించాలో తెలియదని,చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నంత మాత్రాన వారు జర్నలిస్టులమంటూ ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. దీనివల్ల ప్రజల నుండి వచ్చే స్పందనను, జర్నలిస్టులపై జరిగే దాడులుగా మార్చేస్తున్నారు అని వివరించారు. రాజకీయ కార్యకర్తలు జర్నలిస్టులుగా వ్యవహరిస్తున్నకారణంగా,ప్రజలు చేస్తున్న దాడులను మొత్తం జర్నలిస్టులపై జరుగుతున్నట్లు భావించకూడదని రేవంత్ రెడ్డి సూచించారు. అసెంబ్లీలో గానీ..మంత్రుల దగ్గరికి గానీ..ఎలాంటి అర్హత ఉన్న వారిని పంపించాలన్న అంశంపై కొన్ని విధివిధానాలు రూపొందించి ఇస్తే..దాన్ని కేబినెట్‌లో చర్చించి చట్టబద్దత తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని సీఎం చెప్పుకొచ్చారు.
2016 అక్రిడేషన్ రూల్స్‌లో అనేక పొరపాట్లు
మరోవైపు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పలు విషయాలను ప్రస్తావించారు. జిల్లాలు, మండలాల్లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కానీ హైదరాబాద్‌లో ఉన్న మీడియా ప్రతినిధులకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2016 అక్రిడేషన్ రూల్స్‌లో అనేక పొరపాట్లు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అక్రిడేషన్ జారీకి భాష, కులం, మతంతో సంబంధం ఉండకూడదని, పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా చూసేలా సూచించారు.
అక్రిడేషన్ కార్డులు అమ్మకం
నిబంధనలు పాటిస్తున్న అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందజేయడానికి ప్రయత్నం చేస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అక్రిడేషన్ కార్డులు అమ్మకం జరుగుతోందని, అది జర్నలిస్టుల పరువుకు నష్టం కలిగించేదని చెప్పారు. కొంతమంది అక్రిడేషన్ కార్డును చూపించి సామాన్యులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వివరించారు. ప్రెస్ అకాడమీ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు, నైతిక ప్రమాణాలను మెరుగు పరచేందుకు శిక్షణ తరగతులు, సెమినార్లు, వర్క్ షాప్స్ నిర్వహించాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు.