
Revanth Reddy: టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా.. ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్‌షోలో రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి దిశగా ప్రయాణించేందుకు జపాన్‌కు చెందిన పారిశ్రామిక, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
తన జపాన్ పర్యటనలో భాగంగా టోక్యో నగరంలోని హోటల్ ఇంపీరియల్ వేదికగా నిర్వహించిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షో కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర అధికార బృందం కూడా పాల్గొంది.వారు తెలంగాణలోని పెట్టుబడులకు అనువైన అవకాశాలపై సమగ్రంగా వివరించారు.
వివిధపరిశ్రమల నుంచి వచ్చిన దాదాపు 150మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో హాజరయ్యారు.
ఈసందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ,తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములవ్వాలని,రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు.
వివరాలు
టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా...
"జపాన్ దేశం ఉదయించే సూర్యుడికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. అలాగే మా రాష్ట్రం కూడా 'తెలంగాణ రైజింగ్' అనే నినాదంతో ముందుకు సాగుతోంది. ఈరోజు తెలంగాణ కూడా జపాన్‌లో ఉదయిస్తున్నదనే భావన మాకు ఉంది," అని సీఎం తెలిపారు.
టోక్యో నగరం గురించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, అక్కడి మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, ఆవిష్కరణలు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.
"ఇక్కడి ప్రజలు ఎంతో వినయంతో, మర్యాదతో ఉండే వారు. టోక్యో నగరం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే క్రమంలో టోక్యో ఎంతో మోటివేషన్ ఇచ్చింది," అని పేర్కొన్నారు.
వివరాలు
లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులపై దృష్టి
విశ్వస్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మనుషులు, స్థిరమైన పాలన విధానాలు తెలంగాణలో ఉన్నాయని, వీటిని జపాన్ పారిశ్రామికవేత్తలకు అందిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్‌టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులపై దృష్టి పెట్టాలని సూచించారు.
భారత్-జపాన్ కలిసి పనిచేస్తే ప్రపంచానికి ఆశాజనకమైన భవిష్యత్తును నిర్మించగలమని తెలిపారు.
వివరాలు
తెలంగాణ - పెట్టుబడుల కోసం అనువైన రాష్ట్రం
జపాన్ కంపెనీలకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్‌టైల్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం తెలంగాణలో ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ వివరించారు.
దేశంలో మొదటిసారిగా హైదరాబాదులో నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్న నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీ అయిన 'ఫ్యూచర్ సిటీ', మూసీ నదిని పునరుజ్జీవించేందుకు రూపొందించిన ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన ప్రచార వీడియోలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.
వివరాలు
జపాన్‌లోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో.. తెలంగాణ ప్రతినిధి బృందం
రోడ్‌షో అనంతరం తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్‌లోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైంది.
ఈ సమావేశంలో భారత రాయబారి సీబీ జార్జ్ పాల్గొని, భారత్-జపాన్ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాలపై వ్యాఖ్యానించారు.
జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ మాట్లాడుతూ, తెలంగాణతో తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు.