Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇకపై కాన్వాయ్ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు ఉండవు!
సీఎం కాన్వాయ్ వెళ్తుందంటే రోడ్లపై ఏర్పడే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహనాలు నిలిచిపోవడం, ట్రాఫిక్ సమస్య ఏర్పడడం సర్వసాధారణం. ముఖ్యమంత్రి రాకకు ముందే ట్రాఫిక్ పోలీసులు రోడ్లను క్లోజ్ చేస్తారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా అత్యవసరంగా వెళ్లేవారికి ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యకు పరిష్కారంగా తన కాన్వాయ్ ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మార్గదర్శకాలను జారీ చేశారు. కాన్వాయ్ సమయంలో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా, సాధారణ వాహనాలను సైతం నిర్బంధించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని గతంలోనే పోలీసు అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు
కొన్నిరోజులపాటు ఈ విధానం అమలు చేశారు. అయితే భద్రతా చర్యల దృష్ట్యా సాధారణ వాహనాలను మరలా నిలిపివేశారు. జూబ్లీహిల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పోలీసు ఉన్నతాధికారులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాన్వాయ్ ప్రయాణించే సమయంలో వీలైనంత తక్కువ వాహనాలతో ఉండాలని, ఎస్కార్ట్ వాహనాలను కూడా తగ్గించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే కొన్ని మార్పులు చేసి, సీఎం ప్రయాణించే మార్గానికి అపొజిట్ డైరెక్షన్‌లో వాహనాలను అనుమతిస్తున్నారు. ముఖ్యమైన టీ-జంక్షన్‌ల వద్ద మాత్రం ఒకవైపు వాహనాలను నిలిపివేయడం గమనార్హం.