
Integrated Schools: నియోజకవర్గానికి రెండు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు.. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాలుర కోసం ఒకటీ, బాలికల కోసం మరొకటీ చొప్పున "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు" ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తొలి దశలో ప్రతిపాదించిన పాఠశాలల కోసం అవసరమైన భూముల సేకరణ పూర్తయినందున, ఇప్పుడు రెండవ విడత పాఠశాలలపై దృష్టి కేంద్రీకరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. బుధవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో విద్యాశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
వివరాలు
ప్రతి నియోజకవర్గంలో రెండు పాఠశాలలు
అయితే హైదరాబాద్ జిల్లాను మినహాయించి మిగిలిన 105నియోజకవర్గాల్లో ఇది అమలు అయ్యింది. తాజాగా సీఎం చేసిన ప్రకటన ప్రకారం,ఇక నుంచి ప్రతి నియోజకవర్గంలో రెండు పాఠశాలలు.. బాలుర కోసం ఒకటి,బాలికల కోసం మరొకటి.. నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నమూనాలను, అలాగే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ భవనం నమూనాను పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని మార్పులను కూడా సూచించారు. "ప్రతి యంగ్ ఇండియా పాఠశాలలో విశాలమైన జాతీయ జెండా ఏర్పాటు చేయాలి. పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.నిర్మాణ పురోగతిపై ప్రతీ వారం నాకు నివేదిక ఇవ్వాలి. టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి," అని రేవంత్ ఆదేశించారు.
వివరాలు
ఇంటర్‌లో ఉత్తీర్ణత ఎందుకు తగ్గుతోంది?
పదవ తరగతిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నప్పటికీ, ఇంటర్మీడియట్ పూర్తి అయ్యే సమయానికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న విషయం ముఖ్యమంత్రి గమనించారు. దీనికి గల కారణాలను గుర్తించి, పరిష్కార మార్గాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇంటర్ దశ ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైనదని, ఆ సమయంలో సరైన మార్గదర్శకత్వం అవసరమని తెలిపారు. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ తప్పనిసరిగా ఇంటర్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, విద్యార్థుల అడ్మిషన్లపైనే కాకుండా, వారి హాజరుపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. ఇంటర్మీడియట్ విద్యను మెరుగుపరచడానికి అన్ని స్థాయిల్లో చర్చలు జరిపి, అవసరమైతే శాసనసభలోనూ ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
వివరాలు
డ్రాపౌట్ రేటు తక్కువ
ఇతర రాష్ట్రాల్లోని పాఠశాలల్లో 12వ తరగతి వరకు విద్య అందుబాటులో ఉండటంతో, డ్రాపౌట్ రేటు తక్కువగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపధ్యంలో,దేశంలోని 12వ తరగతి వరకు విద్యను అందిస్తున్న రాష్ట్రాలు మరియు ఇంటర్ వేరుగా నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేం.నరేందర్ రెడ్డి,ప్రభుత్వ సలహాదారు కేశవరావు,సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి,విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా,ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి,సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ఆచార్య కె. వేంకటేశ్వరరావు, తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.