Page Loader
Revanth Reddy: 'మేము బాధ్యతలు చేపట్టేనాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం': రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్
మేము బాధ్యతలు చేపట్టేనాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం': రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్

Revanth Reddy: 'మేము బాధ్యతలు చేపట్టేనాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం': రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తైనప్పటికీ, ప్రజల ఆశయాలు ఇంకా నెరవేరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన అధికారిక వేడుకల్లో పాల్గొన్న ఆయన, గత పదేళ్ల ప్రభుత్వంపై ప్రజలు తిరస్కార భావనతో ఓటేసి, ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. అనేక దశాబ్దాల ఉద్యమం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు. తాము అధికార బాధ్యతలు చేపట్టే నాటికి పాలన వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

వివరాలు 

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 

రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని సీఎం తెలిపారు. అన్నదాతల కోసం రూ.2 లక్షల రుణ మాఫీని అమలు చేశామని చెప్పారు. రైతులకు ఉచితంగా విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.13 వేల కోట్లు వెచ్చిస్తోందని పేర్కొన్నారు. అలాగే, 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకం కింద ప్రతి రైతుకి రూ.12 వేలు ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామని తెలిపారు. రైతులు పండించే సన్న వడ్లకు ప్రోత్సాహకంగా ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందజేస్తున్నామని చెప్పారు. దేశంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని గర్వంతో తెలిపారు.

వివరాలు 

రైతులకు భూసంబంధిత ఇబ్బందులు లేకుండా చర్యలు 

రైతులు భూమికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కొనకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం స్పష్టం చేశారు. అందులో భాగంగా, భూభారతి యాప్ ను ప్రవేశపెట్టామని చెప్పారు. కొంతమందికి ధరణి సిస్టమ్ లాభపడితే, భూభారతి ప్రతి పౌరుడికీ భద్రతగా నిలుస్తుందని వివరించారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ, అధికారులు నేరుగా రైతుల ఇళ్లకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్న విధానాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.

వివరాలు 

ఒకే ఏడాదిలో 60,000 ఉద్యోగాల భర్తీ 

దేశంలో ఏ ఇతర రాష్ట్రం చేయనంతగా, ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ ముందుందని సీఎం అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. అలాగే, పెట్టుబడుల ప్రవాహం ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. నిరుద్యోగుల విశ్వాసాన్ని తిరిగి పొందామని తెలిపారు. యువత కోసం 'యంగ్ ఇండియా స్కూల్స్' అనే ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి, నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నామని వివరించారు. దేశంలో కోట్లలో యువత ఉన్నా, ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ క్రీడాపోటీల్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా లభించకపోవడం దురదృష్టకరమని సీఎం వ్యాఖ్యానించారు. క్రీడల అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని సూచించారు.