CM Stalin vs Governor Ravi: తమిళనాడులో 'ద్రవిడ' పదంపై చర్చ.. గవర్నర్‌ను రీకాల్ చేయాలని సీఎం స్టాలిన్ డిమాండ్..
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై తీవ్ర విమర్శలు చేశారు.
గవర్నర్‌ను వెంటనే రీకాల్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల చెన్నైలో జరిగిన దూరదర్శన్ స్వర్ణోత్సవ వేడుకల్లో గవర్నర్ ఆర్‌ఎన్ రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తమిళ రాష్ట్ర గీతం ఆలపించిన సమయంలో గవర్నర్ ఉద్దేశపూర్వకంగా "ద్రవిడ" అనే పదాన్ని పలకకుండా దాటవేశారని స్టాలిన్ ఆరోపించారు.
ఈ క్రమంలోనే గవర్నర్ ద్రవిడియన్ అలర్జీతో బాధపడుతున్నారా అని ప్రశ్నించారు.
జాతీయ గీతంలో కూడా "ద్రవిడ" పదాన్నిదాటవేసే దమ్ము ,ధైర్యం ఆయనకి ఉందా అని సవాల్ చేశారు.
కావాలనే గవర్నర్ తమిళుల మనోభావాలను దెబ్బతీయాలని చూశారని,అందువల్ల ఆయనను వెంటనే తొలగించాలని కేంద్రాన్ని కోరారు.
వివరాలు
ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర ఆగ్రహం
ఈ ఆరోపణలపై గవర్నర్ కార్యాలయం స్పందిస్తూ, గవర్నర్ కేవలం ఆ కార్యక్రమానికి హాజరయ్యారని, గీతాన్ని ఆలపించిన ట్రూప్ ద్రవిడ పదాన్ని దాటవేసిందని వివరించింది.
దూరదర్శన్ తమిళ్ కూడా ఈ విషయంలో క్షమాపణలు చెబుతూ, గాయకుల దృష్టి లోపం వల్ల అది జరిగిందని పేర్కొంది. తమ వల్ల గవర్నర్‌కు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు చెప్పారు.
ఈ వివరణపై ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గవర్నర్ ఈ విషయంలో స్పందించకపోవడంపై నిలదీశారు.
"రాజ్‌భవన్‌ను రాజకీయాల కోసం ఉపయోగించడం తగదు. తమిళ భాషను కేంద్రం గౌరవించకపోతే, తాము ఎంతవరకైనా పోరాడతామని.. నిర్బంధ హిందీ భాషను తీసుకువస్తే ఊరుకోం' అంటూ హెచ్చరించారు.