Congress: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. బీజేపీ నేతలు, మిత్రపక్షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణల ప్రకారం, బుధవారం దిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్‌స్టేషన్‌లో పలువురు బీజేపీ నేతలపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ ఈ ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు.
ఫిర్యాదులో బీజేపీ నేత పేర్లు
"రాహుల్ గాంధీని ఉగ్రవాది అని సంభోదిస్తూ, పలువురు ఎన్డీఏ నేతలు,వారి మిత్రపక్షాలు ఆయనపై దాడి చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాహుల్ పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సమస్యలపై కేంద్రాన్ని నిరంతరం ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇది బీజేపీ, దాని మిత్రవర్గాలకు నచ్చడం లేదు. అందుకే వారు రాహుల్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల్లో అశాంతి నెలకొనేలా చేయడానికి కుట్రలు పన్నుతున్నారు'' అని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబరు 11న రాహుల్‌పై బహిరంగ బెదిరింపులకు పాల్పడిన బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా, రైల్వేశాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ బిట్టు, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌ల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు
అంతేకాకుండా, మహారాష్ట్రలోని బుల్దానా నియోజకవర్గ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "రాహుల్ గాంధీని చంపిన వారికి రూ.11 లక్షల రివార్డు అందిస్తా" అని గైక్వాడ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన విదేశీ పర్యటనలో భారత్‌లో రిజర్వేషన్ల వ్యవస్థను తొలగించాలని సూచించారంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. గైక్వాడ్‌ను విధ్వంసకారుడిగా అభివర్ణించింది. దీంతో, బుల్దానా నగర పోలీస్ స్టేషన్‌లో గైక్వాడ్ పై కేసు నమోదైంది.
రాహుల్ గాంధీకి రక్షణ కల్పించాలి: స్టాలిన్
రాహుల్ గాంధీపై హత్య బెదిరింపులు వస్తున్నాయని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. "రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు, వారి మిత్రపక్షాలు చేస్తున్న బెదిరింపులను చూసి నేను తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. ప్రజల్లో రాహుల్‌కు పెరుగుతున్న మద్దతు కొంతమందిని నిద్ర లేకుండా చేస్తోంది. అందువల్లే వారు ఇటువంటి నీచమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడికి రక్షణ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో బెదిరింపులకు, హింసకు తావు లేదని నిరూపించాలి" అని డీఎంకే అధినేత స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.