
నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం తెలంగాణకు రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మంగా ఖమ్మంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు.
ఈ సభ ద్వారా మరికొన్ని నెలల్లో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాహుల్ గాంధీ శంఖారావాన్ని మోగించనున్నారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న సభ కాంగ్రెస్ పార్టీకి నూతనోత్తేజాన్ని ఇవ్వనుంది.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు కీలక నేతలు రాహుల్ గాంధీ సమక్షలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.
ఖమ్మం పట్టణంలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి తదితరుల కటౌట్లు, పోస్టర్లను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు.
ఖమ్మం
భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు
కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్‌పీ) నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఆదివారం రాహుల్ గాంధీ సమక్షంలో తన హాత్ సే హాత్ జోడో పాదయాత్రను ముంగించనున్నారు.
భట్టి విక్రమార్క మల్లు తన 109 రోజుల యాత్రను మార్చి 16న ఆదిలాబాద్‌లోని పిప్రి గ్రామం నుంచి ప్రారంభించారు. 36 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసి 17 జిల్లాల్లో ఆయన పాదయాత్ర చేశారు.
మొత్తం 750 గ్రామాల గుండా 1,360 కిలోమీటర్లు భట్టి నడిచారు. ఖమ్మంలో సభా వేదిక 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని, సభకు ఐదు లక్షల మందిని సమీకరించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
కాంగ్రెస్
సాయంత్రం 5గంటలకు రాహుల్ గాంధీ ప్రసంగం
ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మంచి ఊపుమీద ఉంది. ఈ క్రమంలో అదే ఉత్సాహంతో తెలంగాణలోనూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో గెలుపు గుర్రాలను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ బీఆర్‌ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లోచేరడం ద్వారా ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గెలుపు అవకాశాలు పెరుగుతాయని కాంగ్రెస్ భావిస్తోంది.
రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3.30గంటలకు గన్నవరం (విజయవాడ) చేరుకుని హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుని సాయంత్రం 5 గంటలకు సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఖమ్మం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం చేరుకుని అక్కడి నుంచి విమానంలో దిల్లీకి వెళ్తారు.
కాంగ్రెస్
ఖమ్మం సభతో బీఆర్‌ఎస్ పాలనకు తెర: రేవంత్ రెడ్డి
ఖమ్మంలో నిర్వహించే కాంగ్రెస్ సభతో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలనకు తెరపడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ సభతోనే రాహుల్ గాంధీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని మోగిస్తారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ హాజరయ్యే ర్యాలీని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
అంతేకాకుండా అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాల్‌ను తిప్పికొట్టేందుకు కూడా ఖమ్మం సభను వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, 2024 జనవరి నాటికి అధికార పక్షంగా మారేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.