Vasantrao Chavan: కాంగ్రెస్ ఎంపీ వసంత్ చవాన్ కన్నుమూత
మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ వసంతరావు చవాన్ సోమవారం(ఆగస్టు 26) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆరోగ్యం క్షీణించడంతో,తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని క్రీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించగా సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు.ఆయన మృతి పట్ల రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. అందిన సమాచారం ప్రకారం అర్ధరాత్రి ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అనంతరం సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. వసంతరావు చవాన్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో ఆయనని ఆసుపత్రిలో చేర్చారు. మొదట్లో ఆరోగ్యం క్షీణించడంతో నాందేడ్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కొంతకాలం పాటు చికిత్స అందించినా, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు.
వసంతరావు చవాన్ రాజకీయ జీవితం
వసంతరావ్ చవాన్ మహారాష్ట్రలోని గొప్ప నాయకులలో ఒకరు. 2009లో నైగావ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి తొలిసారి మహారాష్ట్ర అసెంబ్లీకి చేరుకున్నారు. ఈఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.ఆ తర్వాత ఆయన రాజకీయ స్థాయి పెరుగుతూ వచ్చింది. అయన సెప్టెంబర్ 2014లో కాంగ్రెస్‌లో చేరాడు.పార్టీలో చేరడానికి ముందు మేలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నియమించబడ్డాడు.2014 అసెంబ్లీ ఎన్నికల్లో నైగావ్ స్థానం నుంచి కూడా గెలుపొందారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వసంతరావు నాందేడ్ లోక్‌సభ స్థానం నుంచి 59442ఓట్లతో గెలుపొందారు.బీజేపీకి చెందిన చిఖ్లికర్ ప్రతాపరావు గోవిందరావుపై ఆయన విజయం సాధించారు. వసంతరావు చవాన్ మొదటిసారిగా 1978లో తన నాయిగావ్ గ్రామానికి సర్పంచ్ అయ్యాడు.ఆయన మరణం మహారాష్ట్ర కాంగ్రెస్‌కు తీరని లోటు.