LOADING...
Congress-BJP: బీడీ,బిహార్‌ "బి"తోనే మొదలవుతాయి..కేరళ కాంగ్రెస్‌ పోస్టుపై వివాదం 
బీడీ,బిహార్‌ "బి"తోనే మొదలవుతాయి..కేరళ కాంగ్రెస్‌ పోస్టుపై వివాదం

Congress-BJP: బీడీ,బిహార్‌ "బి"తోనే మొదలవుతాయి..కేరళ కాంగ్రెస్‌ పోస్టుపై వివాదం 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్రం సిగరెట్‌,పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ స్లాబుల్లో చేసిన మార్పులను విమర్శిస్తూ,కేరళ కాంగ్రెస్‌ ఒక సోషల్‌ మీడియా పోస్టు పెట్టింది. అయితే ఆ పోస్టులో చేసిన వ్యాఖ్యలు బిహార్‌కు సంబంధించి ఉండటంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. "బీడీ, బిహార్‌ రెండూ 'బి' అక్షరంతోనే మొదలవుతాయి"అని పేర్కొన్న ఆ పోస్టుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కేంద్రం జీఎస్టీ రేట్లను సవరించిన విషయం తెలిసిందే. సిగరెట్‌,పొగాకుపై ఉన్న పన్నును 28 శాతం నుంచి 40 శాతానికి పెంచగా,బీడీలపై మాత్రం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయాన్నివ్యతిరేకిస్తూ కేరళ కాంగ్రెస్‌ తన అధికారిక సోషల్‌ మీడియాలో ఆ పోస్టు పెట్టింది.

వివరాలు 

 బిహార్‌ ప్రజల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు:బీజేపీ 

"బీడీ, బిహార్‌ రెండూ 'బి'తోనే మొదలవుతున్నాయి. ఇకపై వాటిని పాపంగా పరిగణించాల్సిన అవసరం లేదు" అంటూ చేసిన ఆ వ్యాఖ్యలు కొద్దిసేపటికే డిలీట్‌ అయ్యాయి. కానీ అప్పటికే ఆ పోస్టు వైరల్‌ కావడంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు బిహార్‌ ప్రజల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. బిహార్‌ ఉపముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ, "మొదట ప్రధాని మోదీని, ఆయన తల్లిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ అవమానకర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు మొత్తం బిహార్‌ను కించపరుస్తోంది. ఇదే కాంగ్రెస్‌ అసలు స్వభావం" అని తీవ్రంగా విమర్శించారు.

వివరాలు 

స్పందించని కాంగ్రెస్ 

బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాజ్‌ పునావాలా కూడా ఇదే అంశాన్ని ఎత్తి చూపారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ దీనిపై నిశ్శబ్దంగా ఉండటాన్ని ప్రశ్నించారు. మరోవైపు జేడీయూ నేత సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ, "బి అంటే బీడీ మాత్రమే కాదు.. బుద్ధి కూడా. కానీ అది మాత్రం కాంగ్రెస్‌కు లేదని స్పష్టంగా కనిపిస్తోంది. బిహార్‌కు ఏదైనా మంచి జరుగుతుందంటే కాంగ్రెస్‌ అసహనం చెందుతుంది" అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వివాదాస్పద పోస్టుపై కాంగ్రెస్‌ ఇంకా అధికారికంగా స్పందించలేదు.