Page Loader
Dallewal: దల్లేవాల్ ఆరోగ్యంపై నేడు సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్
దల్లేవాల్ ఆరోగ్యంపై నేడు సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్

Dallewal: దల్లేవాల్ ఆరోగ్యంపై నేడు సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 06, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ వద్ద రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆమరణ నిరహార దీక్ష 42వ రోజుకు చేరుకుంది. ఈ రోజు, జనవరి 6, ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడం సంయుక్త కిసాన్ మోర్చాను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. శనివారం, స్ట్రెచర్ మీద నుంచే మహా పంచాయత్‌ను ఉద్దేశించి 11 నిమిషాల పాటు ప్రసంగించిన ఆయనను తిరిగి దీక్షా శిబిరానికి తీసుకెళ్లిన తరువాత ఆయన ఆరోగ్యం మరింత దెబ్బతింది. ఆదివారం నాటికి దల్లేవాల్ మగతలోకి వెళ్లారని, వాంతులు చేసుకుంటున్నారని డాక్టర్ అవతార్ సింగ్ తెలిపారు.

వివరాలు 

వైద్య సాయాన్ని తిరస్కరించిన దల్లేవాల్

డాక్టర్ అవతార్ సింగ్ ప్రకారం, దల్లేవాల్ మూత్ర పిండాలు కూడా పనిచేయలేని స్థితికి చేరుకున్నాయని, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్‌ ద్వారా ఇది నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం ఆయన కనీసం మాట్లాడే పరిస్థితిలో కూడా లేరని, దీక్షను ఆపినా ఆయన కీలక అవయవాలు సరిగా పని చేస్తాయన్న హామీ లేదని ఎస్‌కేఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దల్లేవాల్ పూర్తిగా నిలబడలేని స్థితిలో ఉండటంతో, ఆయన బరువును కూడా ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నామన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వైద్య సాయం అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం ముందుకు వచ్చినా, దల్లేవాల్ దానిని తిరస్కరించారు.

వివరాలు 

దల్లేవాల్  ఆమరణ నిరహార దీక్ష

అయితే, పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై ధిక్కార చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈ రోజు విచారించనుంది. ఆదివారం పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ నానక్ సింగ్, మాజీ డిప్యూటీ డీఐజీ నరీందర్ భార్గవ్ దల్లేవాల్‌తో మాట్లాడారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ, దల్లేవాల్ నవంబర్ 26 నుంచి ఆమరణ నిరహార దీక్షను కొనసాగిస్తున్నారు.