Page Loader
Covid-19: దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు! 
దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు!

Covid-19: దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్.. వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. భారత్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1010కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. కేసుల సంఖ్య వెయ్యిని దాటడం ప్రజల్లో ఆందోళనకు దారి తీస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్లైన ఎన్‌బీ 1.8.1, ఎల్‌ఎఫ్‌ 7 ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది. అయితే ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో పరిస్థితి ఇంకా అదుపులోనే ఉందని, వ్యాప్తి తక్కువగానే కొనసాగుతున్నదని కన్సార్టియం స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్రస్తుతం చలామణీలో ఉన్న జేఎన్‌1 సబ్‌వేరియంట్‌కు చెందిన ఎన్‌బీ 1.8.1 వేరియంట్‌ ప్రభావం తీవ్రంగా ఉందన్న స్పష్టమైన ఆధారాలు లభించలేదని వెల్లడించారు.

Details

కేసుల పెరుగుదలపై వైద్య నిపుణుల విశ్లేషణ

కరోనా కేసుల పెరుగుదలపై వైద్య నిపుణులు పలు కీలక అంశాలను వివరించారు. గతంలో కరోనా సోకినవారికి లేదా టీకాలు వేసుకున్నవారికి ఇప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిన అవకాశం, అలాగే దేశంలో సీజనల్‌ ఫ్లూ, ఇతర వైరల్‌ ఇన్ఫెక్షన్లు పెరిగిన ప్రభావం వల్లనూ కేసులు పెరుగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు అలెర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రం సూచిస్తోంది.

Details

రాష్ట్రాల వారీగా కరోనా గణాంకాలు

కరోనా తాజా గణాంకాల్లో కేరళ మరోసారి ఆందోళనకర స్థితిని ఎదుర్కొంటోంది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 43 శాతం కేరళలో ఉండగా, మహారాష్ట్రలో 21 శాతం కేసులు నమోదయ్యాయి. తరువాత ఢిల్లీ, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. కేరళలో ఇప్పటివరకు 519 కేసులు, అలాగే మూడు మరణాలు సంభవించాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Details

కేరళలో అప్రమత్తమైన వైద్య శాఖ

కేసుల పెరుగుదల నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో టెస్టింగ్‌ వేగవంతం చేయాలని, అలాగే అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కేసుల పెరుగుదలపై పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.