Sitaram Yechury: సీతారాం ఏచూరికి కాకినాడతో అనుబంధం.. గతంలో కాకినాడ లైబ్రరీకి రూ.10 లక్షల సాయం
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. న్యుమోనియా తరహా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో విపరీతంగా బాధపడుతున్న ఆయన, ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ, ఆక్సిజన్ సపోర్ట్ అందించినప్పటికీ పరిస్థితి మెరుగు కాకపోవడం వల్ల, గురువారం మధ్యాహ్నం 3:03 గంటలకు తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు ఆయన పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధన కోసం ఎయిమ్స్‌కు దానం చేయాలని నిర్ణయించుకున్నారు.
కాకినాడ రామారావుపేటలో "ఏచూరి టవర్స్"
సీతారాం ఏచూరికి కాకినాడతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన తల్లిదండ్రులు కాకినాడకు చెందిన వారు. కానీ ఉద్యోగ రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఉద్యోగ విరమణ తర్వాత కాకినాడలో స్థిరపడ్డారు. సోమయాజులు కాకినాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సీతారాం ఆయనకు సేవలు చేశారు. కానీ సోమయాజులు 1999 అక్టోబర్ 11న మృతిచెందారు. కాకినాడ రామారావుపేటలో "ఏచూరి టవర్స్" అనే భవనం సమీపంలో మరో నివాసం ఉండేది. మూడు సంవత్సరాల క్రితం వరకు సీతారాం తల్లి అక్కడే నివసించేవారు, కానీ ఆమె ఆరోగ్యం క్షీణించిన తరువాత ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆమె 2021 సెప్టెంబర్‌లో మరణించారు.
ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు సాయం
సీతారాం ఏచూరి తల్లి కల్పకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందాకు సోదరి. కల్పకం దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ శిష్యురాలిగా ప్రసిద్ధి చెందారు. కాకినాడలో ఆలిండియా ఉమెన్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించి మహిళా అభ్యున్నతి కోసం కృషి చేశారు. సీతారాం ఏచూరి కాకినాడకు ఉన్న అనుబంధంతో, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సమయంలో కాకినాడ గాంధీభవన్‌లో గ్రంథాలయం నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు సాయం అందించారు. సీతారాం ఏచూరి విద్యార్థి నాయకుడిగా సీపీఎం పార్టీలో తన ప్రస్థానం ప్రారంభించారు.ఆ తర్వాత వివిధ స్థాయిల్లో ఎదిగారు. సీపీఎం జాతీయ నాయకత్వంలో ఉన్నప్పటికీ,తెలుగు రాష్ట్రాల్లో కీలక సమావేశాలకు హాజరయ్యారు. ఆయన పుచ్చలపల్లి సుందరయ్య తరువాత సీపీఎంకు నాయకత్వం వహించిన రెండవ తెలుగువారిగా పేరుపొందారు.
పదవిలో ఉండగానే తుదిశ్వాస విడిచిన తొలి నాయకుడు
అయితే ఆయన ఆ పదవిలో ఉండగానే తుదిశ్వాస విడిచిన తొలి నాయకుడిగా మిగిలారు. సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి ఆర్టీసీలో ఇంజినీర్‌గా పనిచేశారు, తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఆయన బాల్యం హైదరాబాద్‌లో గడిచింది. అబిడ్స్‌లోని ఆల్‌సెయింట్స్ పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, నిజాం కళాశాలలో పీయూసీ పూర్తి చేశారు. అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లి, అక్కడి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.