Amaravati: అమరావతిలో శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై దృష్టిసారిస్తూ కీలక భవనాల నిర్మాణానికి మరో ముందడుగు వేసింది. శాశ్వత హైకోర్టు, శాసనసభ భవనాల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది.
శాసనసభ భవన నిర్మాణానికి రూ.768 కోట్ల అంచనా వేసి, హైకోర్టు భవన నిర్మాణానికి రూ.1,048 కోట్ల వ్యయంతో శనివారం బిడ్లు పిలిచారు.
టెండర్ల దాఖలుకు మార్చి 17 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించగా, అదే రోజు సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్లు తెరవనున్నారు.
అనంతరం ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం అర్హత పొందిన ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు.
Details
103 ఎకరాల్లో అసెంబ్లీ భవనం
అసెంబ్లీ భవనం అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ 'ఈ'లో నిర్మించనున్నారు. ఈ భవనం 103.76 ఎకరాల్లో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనుంది.
బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మూడు అంతస్తులతో ప్రత్యేక శైలిలో దీన్ని డిజైన్ చేశారు. లండన్‌కు చెందిన ఫోస్టర్స్ సంస్థ ఈ భవనానికి డిజైన్ అందించింది.
భవనానికి పైభాగంలో శిఖరం ఆకారంలో ప్రత్యేకమైన ఆకృతి ఉంటుందనే, దాని నుంచి అమరావతి నగరాన్ని చూడేలా ప్రణాళిక రూపొందించారు.
2018లో టీడీపీ ప్రభుత్వం శాసనసభ భవన నిర్మాణానికి రూ.555 కోట్ల అంచనా వేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడంతో వ్యయం పెరిగి రూ.768 కోట్లకు చేరింది.
Details
రెండో అంతస్తులో కౌన్సిల్ హాళ్లు, శిక్షణ కేంద్రాలు
ఈ భవనంలో మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్లు, అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాల్, క్యాంటీన్లు, సెంట్రల్ హాల్, లైబ్రరీ వంటివి ఏర్పాటు చేయనున్నారు.
రెండో అంతస్తులో కమిటీల ఛాంబర్లు, సభ్యుల లాంజ్, అసెంబ్లీ, కౌన్సిల్ హాళ్లు, శిక్షణ కేంద్రం ఉండనున్నాయి.
మూడో అంతస్తును నగర వీక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
Details
శాశ్వత హైకోర్టు డిజైన్
హైకోర్టు భవనాన్ని అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ 'ఎఫ్'లో నిర్మించనున్నారు. ఇది మొత్తం 42.36 ఎకరాల్లో, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతుంది.
బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు ఏడు అంతస్తులతో దీన్ని డిజైన్ చేశారు. ఏడో అంతస్తులో కోర్టు సమావేశ మందిరం, డైనింగ్ హాల్, సువిశాల గ్రంథాలయం ఏర్పాటుకానున్నాయి.
2019 ఫిబ్రవరి 3న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చేతుల మీదుగా ఈ భవనానికి శంకుస్థాపన జరిగింది.
మొదట్లో నిర్మాణ వ్యయం రూ.860 కోట్లుగా అంచనా వేయగా, ప్రభుత్వం మారిన తర్వాత పనులు నిలిచిపోయాయి. తాజా అంచనా ప్రకారం, ఈ హైకోర్టు భవనం నిర్మాణానికి వ్యయం రూ.1,048 కోట్లకు చేరింది.