
Rahul Gandhi: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై ఖర్గేకు లేఖ రాసిన సీఆర్పీఎఫ్
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేత రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల సమయంలో భద్రతా నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తున్నారని, ఇది ఆయన భద్రతకు గంభీరమైన ముప్పును సృష్టించే అవకాశం ఉందని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు గురువారం సీఆర్పీఎఫ్ ఒక లేఖ రాసింది. ఇందులో రాహుల్ గాంధీ భద్రతను కాపాడుకోవడానికి పాటించాల్సిన పద్ధతులు స్పష్టంగా సూచించబడ్డాయి. రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను సీఆర్పీఎఫ్ కల్పిస్తోంది. అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఆయన తన విదేశీ పర్యటనల వివరాలను ముందుగా భద్రతా సంస్థలకు తెలియజేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అధికార వర్గాలు గమనించాయి.
వివరాలు
జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా సమాచారం ఇవ్వడం లేదని వెల్లడి
ఇటీవల, ఆయన ఇటలీ, వియత్నాం, దుబాయ్, ఖతార్, యూకే, మలేషియా వంటి దేశాలలో వ్యక్తిగత, రాజకీయ పర్యటనలు చేసిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలకు వెళ్లే ముందు ఆయన భద్రతా సిబ్బందికి ఎలాంటి ముందస్తు సమాచారం అందించలేదని తెలుస్తోంది. సీఆర్పీఎఫ్‌తో పాటు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) కూడా ఈ సమస్యను గమనించి రాహుల్ గాంధీకి నేరుగా ఒక లేఖ రాసింది. ఈ అంశాన్ని 'తీవ్రమైన సమస్య'గా పరిగణించమని, భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించమని సూచించింది. 'యెల్లో బుక్' ప్రోటోకాల్ ప్రకారం, ఉన్నత స్థాయి భద్రత పొందే వ్యక్తులు తమ ప్రయాణ వివరాలు, ముఖ్యంగా విదేశీ పర్యటనల షెడ్యూల్‌ను అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్ఎల్) బృందానికి తప్పనిసరిగా అందించాలి.
వివరాలు
నిబంధనలను నిర్లక్ష్యం చేస్తున్న రాహుల్
ఇది వారి భద్రతను సుస్థిరంగా చూడటానికి, పర్యటనల ప్రదేశాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేయడానికి అవసరం. అయితే, రాహుల్ గాంధీ ఈ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తున్నారు అని సీఆర్పీఎఫ్ లేఖలో తెలిపింది. దీనివల్ల ఆయన భద్రతా వ్యవస్థ బలహీనమవుతుంది.భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు,కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించమని చర్యలు తీసుకోవాలని సీఆర్పీఎఫ్ కోరింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.దేశంలోని కీలక నేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ భద్రత విషయంలో కేంద్ర బలగాలు నేరుగా పార్టీ అధ్యక్షుడికి లేఖ రాశ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ లేఖలపై ఏ విధంగా స్పందిస్తుందో ఇప్పుడు ప్రజల ఆసక్తి ప్రధానంగా ఉంటుంది.