Group-1: గ్రూప్-1 పై నేడు హైకోర్టులో కీలక విచారణ.. తీర్పు కోసం అభ్యర్థుల ఎదురుచూపులు
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఇటీవల పూర్తయ్యాయి. అయితే ఇవాళ మరోసారి గ్రూప్-1కి సంబంధించి పలు పిటిషన్లపై హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ముఖ్యంగా జీఓ 29 సమస్యతో పాటు ఇతర అంశాలు కోర్టు పరిధిలోకి రానున్నాయి. ఈ విచారణతో సంబంధించి అభ్యర్థుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ముందు, అభ్యర్థులు జీవో-29 రద్దుతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పరీక్ష రద్దు చేయలేమని స్పష్టం చేసింది.
అభ్యర్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం
అభ్యర్థుల తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, పరీక్షలు ముందుకు సాగాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టు, పరీక్షలను వాయిదా వేయడం కరెక్ట్ కాదని, ఇంత వరకు ప్రిపేర్ అయిన అభ్యర్థుల శ్రమ వృథా అవుతుందని అభిప్రాయపడింది. దీంతో, గ్రూప్-1 పరీక్షలు యథావిధిగా కొనసాగాలని తుది ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల లేవనెత్తిన అభ్యంతరాలపై హైకోర్టు నేడు మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ విచారణ ఫలితాలు గ్రూప్-1 అభ్యర్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.