AP Rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు 'రెడ్ అలర్ట్'
బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ఏర్పడుతున్న నేపథ్యంలో, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఉదయం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. మంగళవారం ఉదయానికి ఇది వాయుగుండంగా బలపడనుంది. బుధవారం నాటికి తుపానుగా, గురువారం నాటికి తీవ్ర తుపానుగా మారవచ్చని ఐఎండీ తెలిపింది. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున పూరీ (ఒడిశా) సాగర్ ద్వీపం (పశ్చిమ బెంగాల్) మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో గరిష్టంగా గంటకు 120 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపానుకు 'దానా' అనే పేరు పెట్టనున్నారు.
ఉత్తరాంధ్రకు భారీ వర్షాల సూచన
తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురియబోతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో గురువారం మరియు శుక్రవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళరాదని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. సోమవారం అనకాపల్లి, శ్రీసత్యసాయి, ప్రకాశం, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లా బలిఘట్టంలో రాత్రి 8 గంటల వరకు 85.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.