Wayanad Landslides: వాయనాడ్ జలవిలయం.. 344కి చేరిన మృతుల సంఖ్య
కేరళ రాష్ట్రం వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 344కి చేరుకుంది. ఈ మేరకు కేరళ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఇంకా ముమ్మరంగా సహాయక చర్యలను చేపడుతున్నట్లు పేర్కొంది. రెస్క్యూ ఆపరేషన్లలో భాగంగా సాయం చేయడానికి లోతైన శోధన రాడార్లను పంపాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. డ్రోన్‌లు, థర్మల్ స్కానర్‌ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.
సహాయక చర్యలను సందర్శించిన మోహన్ లాల్
ఐదో రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా, ఇంకా 200 మంది గల్లంతైనట్లు సమాచారం. లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, సహాయ చర్యలను సందర్శించేందుకు శనివారం వయనాడ్‌కు వెళ్లనున్నారు. మృతదేహాలను గుర్తించి ఖననం చేసేందుకు కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వయనాడ్‌లో ప్రస్తుతం కొండచరియలు విరిగిపడి 13 గ్రామాలు విధ్వంసమయ్యాయి. పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.