దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి
ఫీడ్‌బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్రం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అనుమతిని ఇచ్చింది. స్నూపింగ్ కేసులో సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని గతంలో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను సీబీఐ కోరగా, ఆయన దానని కేంద్ర హోం శాఖకు పంపారు. తాజాగా కేంద్రం విచారణకు ఆమోదం తెలిపింది. దిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియాకు కేంద్రం తాజా నిర్ణయం ఎదురుదెబ్బే అని చెప్పాలి. అయితే సిసోడియా మాత్రం ఫీడ్‌బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఫీడ్‌బ్యాక్ యూనిట్ స్నూపింగ్ కేసు ఏంటి? సీబీఐ నివేదకలో ఏముంది?
2015లో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొలిటికల్ గూఢచర్యానికి పాల్పడినట్లు సీబీఐ తన నివేదికలో ఆరోపించింది. ఇందుకోసం దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆధ్వర్యంలో పొలిటికల్ ఇంటెలిజెన్స్ సేకరణ కోసం 'ఫీడ్‌బ్యాక్ యూనిట్'ను ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు సీబీఐ పేర్కొంది. సెప్టెంబరు 29, 2015 నాటి క్యాబినెట్ నిర్ణయం ద్వారా 'ఫీడ్‌బ్యాక్ యూనిట్' ఏర్పడిందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. సిసోడియా నేతృత్వంలోని ఏర్పాటైన ఈ యూనిట్‌కు శాసన లేదా న్యాయపరమైన చట్టబద్ధత లేదని చెప్పింది. అయితే రాజకీయ నాయకులపై నిఘా ఉంచిందని అభియోగాలు మోపింది. 'ఫీడ్‌బ్యాక్ యూనిట్' ఏర్పాటుకు సంబంధించి ఎల్‌జీ అనుమతి కూడా తీసుకోలేదని సీబీఐ తెలిపింది.