Delhi New CM: ఫిబ్రవరి 19న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే ఫలితాలు వెలువడినప్పటికీ, ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫిబ్రవరి 19 లేదా 20వ తేదీకి జరుగనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇప్పుడు భారత్‌కు తిరిగి బయలుదేరారు.
ఈ నేపథ్యంలో సోమవారం, మంగళవారం రోజుల్లో భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుందని తెలుస్తోంది.
వివరాలు
48 మంది ఎమ్మెల్యేలలో 15 మంది షార్ట్‌లిస్ట్
ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah), పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తదితర కీలక నేతలు హాజరవుతారని సమాచారం.
ఈ సమావేశం అనంతరం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఢిల్లీలో విజయం సాధించిన 48 మంది ఎమ్మెల్యేలలో పార్టీ 15 మందిని షార్ట్‌లిస్ట్ చేసింది.
వీరిలో తొమ్మిది మందిని ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రివర్గ సభ్యులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అనేక మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ముఖ్యంగా, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ ప్రధానంగా ముందంజలో ఉన్నారు.
వివరాలు
ఒక్క స్థానం కూడా గెలవని కాంగ్రెస్
అలాగే, సతీశ్ ఉపాధ్యాయ్, విజయేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మ వంటి నేతల పేర్లు కూడా చర్చలో ఉన్నాయి.
అంతేకాదు, పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన ఎవరైనా ఎమ్మెల్యే, సిక్కు కమ్యూనిటీకి చెందిన నేత లేదా మహిళను కూడా ఈ పదవికి పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
గతంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల కోసం పోటీ జరగగా, భారతీయ జనతా పార్టీ 48 స్థానాల్లో విజయం సాధించి 27 ఏళ్లుగా కలగా ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యాన్ని సాకారం చేసుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 22 స్థానాలకే పరిమితమవ్వగా, కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన సంగతి తెలిసిందే.