Delhi Excise Policy Scam: నేను జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను: మనీష్ సిసోడియా
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసు విచారణలో సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఆదివారం సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఈరోజు(ఆదివారం) సీబీఐ కార్యాలయానికి వెళ్తున్నానని, లక్షలాది పిల్లల ప్రేమ, కోట్లాది మంది దేశప్రజల ఆశీస్సులు తన వెంట ఉన్నాయని చెప్పారు. ఇదే సమయంలో తాను కొన్ని నెలల పాటు జైలులో ఉండాల్సి వచ్చినా భయపడనని సిసోడియా చెప్పారు.
నేను భగత్ సింగ్ అనుచరుడిని: మనీష్ సిసోడియా
దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ అనుచరుడినని ఈ సందర్భంగా సిసోడియా తనను తాను అభివర్ణించుకున్నారు. తప్పుడు కేసుల్లో జైలుకు వెళ్లడం చాలా చిన్న విషయమన్నారు. సిసోడియా విచారణపై దిల్లీ సీఎం కేజ్రీవాల్ శుక్రవారం స్పందించారు. మద్యం పాలసీ కేసులో సీబీఐ ప్రశ్నించిన తర్వాత సిసోడియాను ఆదివారం అరెస్టు చేస్తారని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా సిసోడియా తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దిల్లీ మద్యం పాలసీ కేసులో ఫిబ్రవరి 26న సీబీఐ విచారణకు రావాలని సిసోడియకు నోటీసులు అందాయి.