
Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ దాడికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థల హస్తం ఉన్నట్టు అధికారులు ఇప్పటికే స్పష్టంచేశారు.
అయితే, ఈ దాడికి కొన్ని వారాల ముందే భారత రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉగ్రదాడికి పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ (ISI) కుట్ర పన్నినట్లు తాజా సమాచారంతో వెల్లడైంది.
నేపాల్‌కు చెందిన ఓ గూఢచారి ద్వారా ఈ కుట్రను అమలు చేయాలని ప్రయత్నించిన ఐఎస్‌ఐ వ్యూహాన్ని భారత నిఘా సంస్థలు సమర్థవంతంగా ఛేదించాయి.
ఈ విషయాన్ని పలు ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనాలు విశ్వసనీయ వర్గాల ఆధారంగా వెల్లడించాయి.
వివరాలు
ఐఎస్‌ఐ కుట్రలో నేపాల్ గూఢచారి పాత్ర
ఈ ఏడాది జనవరిలో భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఓ కీలక సమాచారం అందింది.
పాక్ ఐఎస్‌ఐ కు చెందిన గూఢచారిని నేపాల్ మీదుగా ఢిల్లీకి పంపించి, భారత సైనిక విభాగానికి సంబంధించిన రహస్య పత్రాలు, ప్రధాన ప్రాంతాల ఫోటోలు సేకరించాలని కుట్ర పన్నారని తెలిసింది.
అదే సమయంలో ఢిల్లీ పోలీసులకు కూడా ఓ పాకిస్థానీ ఏజెంట్ నగరంలో సంచరిస్తున్నట్టు సమాచారం వచ్చింది.
వెంటనే కేంద్ర నిఘా సంస్థలతో కలిసి ఢిల్లీ పోలీసులు ఓ రహస్య ఆపరేషన్‌ను ప్రారంభించారు.
వివరాలు
గూఢచారి అన్సారీ అరెస్ట్, కీలక పత్రాల స్వాధీనం
ఈ ఆపరేషన్‌లో నేపాల్‌కు చెందిన అన్సారుల్ మియాన్ అన్సారీ అనే వ్యక్తి ఢిల్లీకి వచ్చి ఇప్పటికే కొన్ని మిలిటరీ డాక్యుమెంట్లను సంపాదించి ఉగ్రకార్యకలాపాలకు సిద్ధంగా ఉన్నట్టు గమనించారు.
దీంతో ఫిబ్రవరి 15న ఢిల్లీలోని ఓ హోటల్ నుంచి అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతడి వద్ద నుంచి ముఖ్యమైన రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
అన్సారీ, నేపాల్ మీదుగా పాక్‌కి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే పోలీసులు అతడిని పట్టుకున్నారు.
అన్సారీకి సహాయం చేసిన రాంచీకి చెందిన అజామ్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
వీరిద్దరూ ఐఎస్‌ఐ అధికారులు లేదా హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్టు దర్యాప్తులో తేలింది.
వివరాలు
విచారణలో కీలక విషయాల వెల్లడి
ఇద్దరినీ ఢిల్లీ తిహార్ జైలుకు తరలించి విచారిస్తున్నారు.
అన్సారీ విచారణలో ఐఎస్‌ఐకు చెందిన గూఢచారుల నెట్‌వర్క్ గురించి అనేక కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.
నేపాల్‌కు చెందిన అన్సారీ ఖతర్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా ఐఎస్‌ఐ ఏజెంట్‌తో పరిచయం ఏర్పడింది.
ఆ వ్యక్తి అతడిని పాకిస్తాన్‌కు తీసుకెళ్లి, అక్కడ కొన్ని రోజుల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత తిరిగి ఢిల్లీకి పంపించాడు.
తర్వాత అజామ్‌తో కలసి భారత సైన్యానికి సంబంధించిన గోప్యమైన సమాచారం సేకరించాడని అన్సారీ అంగీకరించినట్టు సమాచారం.
ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలో ఐఎస్‌ఐ నెట్‌వర్క్‌ను ఛేదించడం ద్వారా, దేశాన్ని అతిపెద్ద ఉగ్రదాడి ప్రమాదం నుంచి తప్పించగలిగామని నిఘా సంస్థలు స్పష్టం చేశాయి.