Delhi Odd-Even : దిల్లీలో కాలుష్యం కోరలు.. 'సరి-బేసి' విధానం ఎప్పట్నుంచి అమలు చేయనున్నారంటే..
దిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. ఈ మేరకు దాన్ని నియంత్రించేందుకు దిల్లీ సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 'సరి-బేసి' విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ క్రమంలోనే స్కూళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీపావళి పండుగ తర్వాతి రోజు నుంచి మళ్లీ 'సరి-బేసి (Odd even scheme)' విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నామని దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. నవంబరు 13 నుంచి 20 వరకు ఈ విధానం అమల్లో ఉంటుందన్నారు. వాహన రిజిస్ట్రేషన్ నంబరు చివరన సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజున రోడ్డెక్కాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నగరంలో కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టనుంది.
BS-3 పెట్రోల్, BS-4 డీజిల్ వాహనాలపై నిషేధం
దిల్లీలో కాలుష్యం హెచ్చు స్థాయికి చేరడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సరి-బేసిపై నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక 10, 12వ తరగతుల వారిని మినహాయించి మిగతా అన్ని తరగతుల వారికి నవంబరు 11 వరకు సెలవులను ప్రకటించామని దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. ఇప్పటివరకు కేవలం ప్రాథమిక స్కూళ్లను మాత్రమే ప్రకటించగా, తాజాగా ఉన్నత పాఠశాలలనూ మూసివేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో రహదారులు, వంతెనల వంటి నిర్మాణాలను సైతం ఆపేస్తున్నామన్నారు. BS-3 పెట్రోల్, BS-4 డీజిల్ వాహనాలపై నిషేధం కొనసాగుతుందన్నారు.అత్యవసర వస్తువులను సరఫరా చేసే ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ ట్రక్కులకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు.