Air Pollution: దిల్లీలో దట్టమైన పొగమంచు.. విజిబిలిటీపై తీవ్ర ప్రభావం!
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్రమైంది. 15 రోజులుగా గాలి నాణ్యత సూచీ అత్యంత అధ్వానంగా మారింది. బుధవారం ఉదయం కూడా పరిస్థితి మరింత దిగజారింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 361గా నమోదైంది. పలు ప్రాంతాల్లో ఈ సంఖ్య 400కి కూడా చేరుకుంది. ఈ సమయంలో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ సమస్యతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, దిల్లీలో అత్యధిక గాలి నాణ్యత సూచీ 417గా నమోదైంది, ఇది 'తీవ్ర' కాలుష్య కేటగిరీలోకి వస్తుంది.
జీరోకు పడిపోయిన విజిబిలిటీ
ఆనంద్ విహార్ ప్రాంతంలో 396, జహంగీర్‌పురిలో 389, ఐటీవోలో 378, ఎయిర్‌ఫోర్ట్ ప్రాంతంలో 368గా నమోదైంది. ఇక గాలి నాణ్యత తగ్గడంతో నగరంలో దట్టమైన పొగమంచు కూడా ఏర్పడింది. దిల్లీకి సన్నిహితంగా ఉన్న నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ ప్రాంతాలను కూడా పొగ కమ్మేసింది. దీంతో, విమాన, రైలు రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో విజిబిలిటీ దాదాపు జీరోగా ఉంది. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలు కనబడకుండా పోయాయి. దీని వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.