LOADING...
India Economy: 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! : EY రిపోర్ట్
2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! : EY రిపోర్ట్

India Economy: 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్! : EY రిపోర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన స్థానాన్ని వేగంగా బలోపేతం చేసుకుంటోంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో కీలక మైలురాళ్లను అధిగమించి, అతిపెద్ద ఆర్థిక శక్తుల సరసన నిలవబోతుందని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఈవై (EY) తాజాగా విడుదల చేసిన నివేదికలో స్పష్టమైంది. ఆ నివేదిక ప్రకారం, మార్కెట్ మారకపు రేటు (Market Exchange Rate) ప్రాతిపదికన 2028 నాటికి భారత్ జర్మనీని అధిగమించి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది. అంతేకాకుండా, కొనుగోలు శక్తి సమానత్వం (PPP) పద్ధతిలో 2038 నాటికి భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగనుందని అంచనా వేయబడింది.

వివరాలు 

IMF అంచనాల ఆధారంగా నివేదిక సిద్ధం చేసిన ఈవై 

ఈ నివేదికను అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనాల ఆధారంగా ఈవై సిద్ధం చేసింది. భారత్ ఆర్థిక అభివృద్ధి వెనుక ఉన్న కారణాలను ఇందులో విశ్లేషిస్తూ.. దేశంలోని విస్తృత యువ జనాభా,అధిక పొదుపు రేటు,నిరంతరంగా పెరుగుతున్న దేశీయ డిమాండ్,స్థిరమైన ఆర్థిక విధానాలు ప్రధాన వృద్ధి శక్తులుగా ఉన్నాయని పేర్కొంది. 2025 నాటికి భారతదేశంలో సగటు వయసు కేవలం 28.8 సంవత్సరాలు మాత్రమే ఉండడం ఒక పెద్ద బలంగా ఈ నివేదిక విశదీకరించింది. మరోవైపు, చైనా, అమెరికా, జర్మనీ, జపాన్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు వృద్ధాప్య జనాభా, అధిక అప్పులు, నెమ్మదైన వృద్ధి రేటు వంటి కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీనికి భిన్నంగా, భారత్ అనుకూల పరిస్థితుల్లో ముందుకు సాగుతోందని స్పష్టం చేసింది.

వివరాలు 

2030 నాటికి పీపీపీ ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 20.7 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు 

2030 నాటికి పీపీపీ ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 20.7 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఈవై లెక్కగట్టింది. అదే సమయంలో, ప్రభుత్వ చర్యల వలన జీడీపీలో రుణ నిష్పత్తి కూడా తగ్గిపోతుందని నివేదిక పేర్కొంది. 2024లో 81.3 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి, 2030 నాటికి 75.8 శాతం వరకు తగ్గనుందని అంచనా వేసింది.

వివరాలు 

దేశంలో జరుగుతున్న వ్యవస్థాగత సంస్కరణలు కూడా భారత వృద్ధి పథానికి మరింత బలం 

ఈ అంశంపై ఈవై ఇండియా చీఫ్ పాలసీ సలహాదారు డీకే శ్రీవాస్తవ మాట్లాడుతూ.. "భారత్ వద్ద విస్తారమైన యువ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, బలమైన పొదుపులు, స్థిరంగా ఉన్న పెట్టుబడి రేట్లు, అలాగే సమతుల రుణ ప్రొఫైల్ ఉన్నాయి. ఇవన్నీ కలసి ప్రపంచ ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో కూడా భారత్‌ను వేగవంతమైన వృద్ధి మార్గంలో నడిపించే ప్రధాన బలాలుగా నిలుస్తాయి" అని వివరించారు. ముఖ్య సాంకేతిక రంగాల్లో సామర్థ్యాలను పెంచుకుంటూ, 2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యం చేరుకునే సరైన మార్గంలో దేశం ప్రయాణిస్తోంది" అని వివరించారు. అదేవిధంగా, దేశంలో జరుగుతున్న వ్యవస్థాగత సంస్కరణలు కూడా భారత వృద్ధి పథానికి మరింత బలాన్నిస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.