
Jagdeep Dhankhar: సుప్రీం కోర్టు 'గడువు'పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హాట్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్లు ఆమోదించకపోవడం లేదా తిరిగి పంపించడం వంటి పరిణామాలపై ఇటీవల సుప్రీంకోర్టు గడువులు విధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలు రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి సూచనలు చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజ్యసభ ఇంటర్న్స్ ఆరవ బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా, న్యాయ వ్యవస్థలు రాష్ట్రపతికి దిశానిర్దేశం చేసే పరిస్థితులు రాజ్యాంగం ఆమోదించదని ధన్‌ఖడ్ తెలిపారు.
ఇది జరిగితే, సుప్రీం కోర్టు ఆర్టికల్ 142 ద్వారా కలిగిన ప్రత్యేకాధికారాలను ప్రజాస్వామ్య వ్యవస్థపై అణ్వాయుధంగా ఉపయోగించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక సందర్భాల్లో ఈ అధికారం విస్తృతంగా వినియోగించడమే ప్రజాస్వామ్య స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించారు.
వివరాలు
10 బిల్లులను చట్టంగా ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం
ఇటీవల తమిళనాడు పెండింగ్ బిల్లుల అంశంపై జస్టిస్ జేబీ పార్దీవాలా,జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చిన సంగతి విదితమే.
తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదించకుండా ఆపేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని సుప్రీం కోర్టు పేర్కొంది.
గవర్నర్ ఆమోదం కోసం బిల్లులను నిలిపి ఉంచాల్సి వచ్చినా, గరిష్ఠంగా ఒక నెల గడువులోనే నిర్ణయం తీసుకోవాలని తీర్పులో స్పష్టంగా తెలిపింది.
ఈ తీర్పు వెలువడిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం ఆ 10 బిల్లులను చట్టంగా ప్రకటించింది.
ఇంతకుముందు రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్ పంపే బిల్లుల విషయమై కూడా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
వివరాలు
కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పును సమీక్షించే అవకాశాలు
గవర్నర్‌లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల వ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
మరే నిర్ణయానికీ రాకపోతే, సంబంధిత రాష్ట్రాలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.
ఈ అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పును సమీక్షించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అదే వేదికపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో జరిగిన నోట్ల కట్టల వ్యవహారంపైనా ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ స్పందించారు.
ఈ ఘటన జరిగి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడం, దర్యాప్తులో పురోగతి లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
న్యాయమూర్తులకు లభించే రక్షణను దృష్టిలో పెట్టుకుని దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.