
Justice Yashwant Varma: నోట్ల వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్ వర్మ.. తన పేరును దాచేశారా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లో నోట్ల కట్టల వివాదంలో చిక్కుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. త్రిసభ్య విచారణ కమిటీ తనపై ఇచ్చిన దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ ఆయన ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లో తన అసలైన పేరును దాచిపెట్టి 'XXX'గా పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇది సాధారణంగా లైంగిక వేధింపుల కేసులు, అత్యాచార బాధితుల పిటిషన్లలో లేదా మైనర్లు, వివాహ విఫలమైన దంపతుల మధ్య పిల్లల కస్టడీకి సంబంధించిన కేసుల్లోనే వ్యవహరించే పద్ధతి.
Details
రెండో ప్రతివాదిగా సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు, హైకోర్టులు ఈ తరహా గుర్తింపుల గోప్యతను సాధారణంగా బాధితుల పరిరక్షణ కోసం పాటిస్తాయి. కానీ ఓ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి ఇలా తన పేరు దాచడం పలు అనుమానాలకు దారితీస్తోంది. జూలై 17న 'XXX వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' పేరిట ఆయన వేసిన పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం మొదటి ప్రతివాదిగా, సుప్రీంకోర్టు రెండో ప్రతివాదిగా ఉన్నారు. అయితే తన వివరాలపై గోప్యత పాటించడానికి ఆయన పేర్కొన్న కారణాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ వ్యవహారానికి నేపథ్యం వెతికితే, జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన నివాసంలో కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడిన ఘటనకే దారి తీస్తుంది.
Details
ముగ్గురు న్యాయమూర్తులతో ప్రత్యేక కమిటీ
మంటలను ఆర్పేందుకు అక్కడికి చేరుకున్న సిబ్బంది ఈ నోట్ల కట్టలను గుర్తించారు. ఈ ఘటనపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్రత్యేక విచారణ కోసం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం, నోట్ల కట్టలు దొరికిన విషయమైతే నిజమేనని తేలింది. దీంతో జస్టిస్ వర్మను రాజీనామా చేయాలని సీజేఐ సూచించారు. అయితే ఆయన దీన్ని తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆయన అభిశంసనకు సిఫారసు చేస్తూ లేఖలు రాసినట్లు సమాచారం.
Details
కేసును కొట్టేసిన సుప్రీం కోర్టు
ఇక జస్టిస్ వర్మపై కేసు నమోదు చేయాలంటూ మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలవగా, దానిని కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో ఆయన వేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. అయితే ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడంలో తానే భాగస్వామిగా ఉన్నందున, తన అభిప్రాయంతో న్యాయస్థానాన్ని ప్రభావితం చేయకుండా ఉండేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్వయంగా విచారణ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, జస్టిస్ వర్మపై అభిశంసన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.