Jammu Kashmir Elections: నామినేటెడ్ ఎమ్మెల్యే నియామకంపై చర్చ.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్న అధికారాలు ఏవీ?
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యేలు చర్చనీయాంశంగా మారారు. ఏ పక్షానికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవచ్చనే అంచనాలు వేళ, ఈ అయిదుగురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఈ నియామకాలను చేస్తే, అది బీజేపీకే అనుకూలంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ మంత్రి మండలి సిఫార్సు లేకుండా నామినేటెడ్ ఎమ్మెల్యేలను నియమించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉంటుందా అనే అంశంపై వాదనలు చెలరేగుతున్నాయి.
జమ్ముకాశ్మీర్ లో 90 అసెంబ్లీ స్థానాలు
కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) లు లెఫ్టినెంట్ గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్యేలను ఉపయోగించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రయత్నం చేస్తే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించాయి. జమ్ముకశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా, ఫలితాలు మంగళవారం వెల్లడవుతాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేలతో శాసనసభలో సభ్యుల సంఖ్య 95కి పెరుగుతుంది. వారికి ఓటు హక్కు కల్పిస్తే, ప్రభుత్వం ఏర్పాటుకు 48 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించకపోతే, ఈ అయిదుగురు నామినేటెడ్ సభ్యులు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కీలకంగా మారవచ్చు. నామినేటెడ్ సభ్యుల నియామకంపై న్యాయ నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నామినేటెడ్ ఎమ్మెల్యేల ప్రభుత్వ ఏర్పాటులో స్పష్టత లేదు
సీనియర్ న్యాయవాది అశ్వనీ కుమార్ దూబే ప్రకారం, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో నామినేటెడ్ ఎమ్మెల్యేల ప్రభుత్వ ఏర్పాటులో పాత్రపై స్పష్టత లేదు. అయితే పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ నామినేటెడ్ సభ్యులను నియమించడం 2018లో సుప్రీం కోర్టు సమర్థించిందని ఆయన గుర్తు చేశారు. సీనియర్ న్యాయవాది శంకర నారాయణ అభిప్రాయప్రకారం, జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తే ఈ వివాదం తలెత్తదని పేర్కొన్నారు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో, న్యాయ పరిధిలో కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది.