
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై 23న పీఏసీ సమావేశం.. ఆ తరువాతే ఎన్నికలపై నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికార కాంగ్రెస్‌లో చర్చలు వేగం పుంజుకున్నాయి. వచ్చే నెలాఖరులోగా ఎన్నికలు జరిపే దిశగా ఆలోచనలు కొనసాగుతున్నాయి. హైకోర్టు ఇప్పటికే సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు నేతలు,అప్పటివరకు సమయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. ఇక మరోవైపు,బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న పార్టీ 'రాజకీయ వ్యవహారాల కమిటీ' (పీఏసీ) సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
వివరాలు
స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చ
ఆ సమావేశంలో సీనియర్ నేతల అభిప్రాయాలు సేకరించి, అత్యధికుల సూచనల ప్రకారం తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం సీఎం నివాసమైన జూబ్లీహిల్స్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు (వీహెచ్) స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. కొందరు మంత్రులు ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని కోరుతున్న విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల కోసం కులగణన సర్వే పూర్తి చేసి, అసెంబ్లీలో బిల్లు ఆమోదించి, రాష్ట్రపతికి పంపించామని... అందువల్ల ఆ అంశానికి కట్టుబడి ఉన్నామనే సంకేతాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరం ఉందని ఈ ముగ్గురు నేతలు సీఎంకు సూచించినట్లు చెబుతున్నారు.
వివరాలు
బీసీ రిజర్వేషన్లు.. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చ
కానీ, బీసీ రిజర్వేషన్లపై కేంద్రం నుంచి ఇంకా స్పందన రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న దానిపై సమాలోచనలు జరిగాయని సమాచారం. కేంద్రం నుంచి త్వరగా నిర్ణయం రాకపోతే, ఎన్నికలను వాయిదా వేసే అవకాశం కోసం అవసరమైతే హైకోర్టును మరింత గడువు అడగాలనే ప్రతిపాదనను మహేశ్‌కుమార్‌గౌడ్ ముందుంచినట్లు తెలుస్తోంది. కేంద్రం జాప్యం ఎంతవరకూ సాగుతుందో స్పష్టత లేనందున, పీఏసీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.
వివరాలు
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చ
అదే సమయంలో, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలపరిచే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ముగ్గురు నేతలు సీఎంతో చర్చించారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ శ్రేణులు మరియు ఇతర పార్టీల నుంచి చేరిన నేతల మధ్య తలెత్తుతున్న విభేదాలను పీసీసీ అధ్యక్షుడు పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. అలాగే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతోందని మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య ఐక్యత నెలకొల్పి, అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం కృషి చేయాలనే నిర్ణయానికి ఈ సమావేశం వచ్చిందని పార్టీ వర్గాలు తెలియజేశాయి.