Page Loader
Disha Salian: మరోసారి తెరపైకి దిశా సాలియన్ కేసు.. ఆదిత్య ఠాక్రేపై దిశ తండ్రి పిటిషన్..
మరోసారి తెరపైకి దిశా సాలియన్ కేసు.. ఆదిత్య ఠాక్రేపై దిశ తండ్రి పిటిషన్..

Disha Salian: మరోసారి తెరపైకి దిశా సాలియన్ కేసు.. ఆదిత్య ఠాక్రేపై దిశ తండ్రి పిటిషన్..

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి,అతని మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి సంబంధిత ఘటనలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. దిశా సాలియన్ ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్ 14వఅంతస్తు నుంచి అనుమానాస్పదంగా పడిపోయి మృతిచెందింది. ఈ ఘటన జరిగిన ఆరు రోజుల తర్వాత, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన నివాసంలో ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. ఇప్పుడు, దిశా సాలియన్ మరణానికి అయిదు సంవత్సరాల తర్వాత,ఆమె తండ్రి సతీష్ సాలియన్ శివసేన (ఠాక్రే)ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ,ఈకేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని,బీజేపీ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుని తన పరువు తీశేందుకు ఇలా చేస్తోందని ఆరోపించారు.

వివరాలు 

 యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR) నమోదు 

దిశా తండ్రి న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2020 జూన్ 8న, ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని 14వ అంతస్తు నుంచి దిశా పడిపోయి మరణించింది. మొదట ఈ ఘటనపై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR) నమోదు చేశారు. అయితే ఆరు రోజుల తర్వాత, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన బాంద్రా అపార్ట్‌మెంట్‌లో మృతి చెందాడు. ఆ సమయంలో పోలీసులు ఈ ఘటనను ఆత్మహత్యగా పేర్కొన్నప్పటికీ, అనంతరం కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించారు. 2020లో, దిశా తండ్రి సతీష్ సాలియన్ తన కుమార్తె మరణంలో ఎటువంటి అనుమానాలు లేవని, దర్యాప్తుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. కానీ, తాజాగా సతీష్ సాలియన్ దాఖలు చేసిన పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు.

వివరాలు 

పిటిషన్‌లో ఆరోపణలు

2020 జూన్ 8న, దిశా తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించిందని, ఆ పార్టీకి ఆదిత్య ఠాక్రే, సూరజ్ పంచోలి, డినో మోరియా తదితరులు హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షుల వాదనల ప్రకారం, దిశా సామూహిక అత్యాచారానికి గురైందని, ఆమెను బలవంతంగా నిర్బంధించారని, తీవ్ర లైంగిక దాడి జరిగిందని ఆరోపించారు. దిశా అత్యంత ఎత్తైన భవనం నుంచి పడిపోయినా, ఆమె శరీరంపై ఎటువంటి తీవ్రమైన గాయాలు లేకపోవడం,సంఘటనా స్థలంలో రక్తం కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌లో ఆరోపణలు ఏమంటే,ఆ సమయంలో రాజకీయ ఒత్తిళ్ల వల్ల, నిందితులను రక్షించేందుకు శవ పరీక్ష నివేదిక మార్చారని, ఫోరెన్సిక్ ఆధారాలను ధ్వంసం చేశారని, సీసీటీవీ ఫుటేజీని తారుమారు చేసినట్టు పేర్కొన్నారు.

వివరాలు 

పోస్ట్‌మార్టం నివేదికను మార్చి..

అంతేకాదు, పోస్ట్‌మార్టం నివేదికను మార్చి, సరైన విచారణ లేకుండానే శవాన్ని తొందరగా దహనం చేశారని ఆరోపించారు. దిశా, సుశాంత్ మృతుల పోస్టుమార్టం సమయాలపై కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం అదే రోజున జరిగితే, దిశా పోస్టుమార్టం 50 గంటల తర్వాత నిర్వహించడం అనుమానాస్పదమని, ప్రధాన నిందితుడిగా ఆదిత్య ఠాక్రే ఉన్నప్పటికీ, ఆయన్ను రక్షించేందుకు అంతా సాక్ష్యాలను నాశనం చేశారని ఆరోపించారు.