Amit shah: మత రిజర్వేషన్లను ఒప్పుకోం.. రాహుల్‌పై అమిత్ షా ఫైర్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ పత్రం చూపి అవమానం చేస్తున్నారని రాహుల్‌పై అమిత్ షా అగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయడాన్ని బీజేపీ ఎప్పటికీ అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. పాలమూ ప్రాంతంలో జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం కాపీని చూపిస్తూ అపహాస్యం చేశారని, కాంగ్రెస్ రాజ్యాంగాన్ని గౌరవించడంలో విఫలమైందన్నారు. బీఆర్ అంబేద్కర్ చేసిన కృషిని కూడా అవమానించిందని అమిత్ షా ఆరోపణలు చేశారు.
నవంబర్ 26న దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం
నవంబర్ 26న దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ఓబీసీ కోటాకు వ్యతిరేకమని, మైనారిటీలకు 10శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తోందని ఆరోపించారు. పీఎం మోడీ నేతృత్వంలో మత రిజర్వేషన్లను ఎప్పటికీ అనుమతించమని స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ విధానమని, కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే అని తేల్చి చెప్పారు. జార్ఖండ్ జేఎంఎం ప్రభుత్వం దేశంలో అత్యంత అవినీతిగ్రస్తంగా ఉందని విమర్శించారు. జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20న ఎన్నికలు జరగనున్నాయి. ఇక నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది.