LOADING...
MEPMA: ఏపీలో అసంఘటిత రంగంలోని పురుష కార్మికుల కోసం పొదుపు సంఘాలు.. ఎంత రుణం లభిస్తుందంటే..
ఏపీలో అసంఘటిత రంగంలోని పురుష కార్మికుల కోసం పొదుపు సంఘాలు..

MEPMA: ఏపీలో అసంఘటిత రంగంలోని పురుష కార్మికుల కోసం పొదుపు సంఘాలు.. ఎంత రుణం లభిస్తుందంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2025
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళలకు డ్వాక్రా గ్రూపులు ఉన్నట్లే, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పురుష కార్మికుల కోసం కూడా ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాలు ఏర్పడుతున్నాయి. ఈ చర్య ద్వారా పురుష కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. డ్వాక్రా పథకం పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం డ్వాక్రా (డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రెన్‌ ఇన్‌ రూరల్‌ ఏరియాస్‌) పథకాన్ని 1982లో ప్రారంభించారు. ఈ పథకం మహిళలకు స్వయం ఉపాధిని అందించడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు రూపొందించబడింది. కేంద్ర ప్రభుత్వం డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలకు తక్కువ వడ్డీ రుణ సౌకర్యాన్ని అందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.

వివరాలు 

పురుషుల కోసం స్వయం సహాయక సంఘాలు 

ఇప్పుడు ఇదే విధానాన్ని పట్టణాల్లోని అసంఘటిత రంగ పురుష కార్మికులకు కూడా వర్తింపజేసేందుకు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (MEPMA - Mission for Elimination of Poverty in Municipal Areas) పురుషుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తోంది. పురుష కార్మికులకు కూడా స్వయం ఉపాధిని పెంపొందించేలా ఈ పథకాన్ని రూపొందించారు.

వివరాలు 

విజయవాడ, విశాఖలో పైలట్ ప్రాజెక్టు 

ఈ పథకం ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుండగా, రాష్ట్రంలో విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా 2,841 గ్రూపులను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ (NULM 2.0) గైడ్‌లైన్స్ ప్రకారం, మహిళల స్వయం సహాయక సంఘాల మాదిరిగా పురుషులకు కూడా రుణ సదుపాయాలు కల్పించనున్నారు. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగ కార్మికులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ప్రయత్నం చేస్తున్నారు.

వివరాలు 

గ్రూప్‌లో ఎంత మంది సభ్యులు ఉండాలి? 

పురుషుల కోసం ఏర్పాటు చేసే స్వయం సహాయక సంఘాల్లో కనీసం ఐదుగురు సభ్యులు ఉండాలి. అయితే,గ్రూపులో ఎంతమందైనా చేరుకోవచ్చు.గ్రూప్ ఏర్పడిన తర్వాత, బ్యాంకులు వారికి రుణాలను మంజూరు చేస్తాయి.రుణ మొత్తాన్ని సభ్యులు వాయిదాల రూపంలో తిరిగి చెల్లించవచ్చు. ఎంత రుణం లభిస్తుంది? ప్రతి సభ్యుడు నెలకు కనీసం ₹100పొదుపు చేయాలి.ఉదాహరణకు ఐదుగురు సభ్యులున్న గ్రూప్‌లో ఒక్కొక్కరు నెలకు ₹500పొదుపు చేస్తే,మూడు నెలల పాటు క్రమంగా పొదుపు చేసినట్లయితే, ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ కింద ₹25,000అందిస్తుంది. ఈ మొత్తంతో ఆరు నెలల పాటు సభ్యులు పొదుపు కొనసాగిస్తే,అకౌంట్‌లో ఉన్న మొత్తానికి బ్యాంకు ఫస్ట్ లింకేజ్ కింద ఆరు రెట్లు రుణం మంజూరు చేస్తుంది.ఈ రుణానికి వడ్డీ మాఫీ కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే అందిస్తాయి.

వివరాలు 

ఈ రంగాల్లోని కార్మికులకు రుణాలు లభిస్తాయి 

పలు అసంఘటిత రంగాల్లో పనిచేసే పురుష కార్మికులకు ఈ రుణ పథకం వర్తించనుంది. వీటిలో ముఖ్యంగా: భవన నిర్మాణ కార్మికులు తోపుడు బండ్లు, రిక్షా కూలీలు గిగ్ వర్కర్స్ - స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ సంస్థల్లో పనిచేసేవారు వేస్ట్ వర్కర్స్ - పారిశుద్ధ్య కార్మికులు డొమెస్టిక్ వర్కర్స్ - ఇళ్లల్లో పనిచేసేవారు, తోట మాలీలు కేర్ వర్కర్స్ - వృద్ధులకు సహాయంగా పనిచేసేవారు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో పనిచేసేవారు NULM 2.0 గైడ్‌లైన్స్ ప్రకారం, ఈ ఆరు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు రుణాలు అందించనున్నట్లు మెప్మా ఎండీ తేజ్ భరత్ తెలిపారు.

వివరాలు 

ఉపాధి పెంపే లక్ష్యం 

మెప్మా సంస్థ పురుషుల్లో పొదుపు అలవాటు పెంపొందించేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని భావిస్తోంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం వల్ల వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకాన్ని అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి పట్టణాల్లో కూడా అమలు చేస్తున్నారు. రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పురుషుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు మెప్మా ఎండీ తేజ్ భరత్ తెలిపారు.