నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఎన్నికల సంఘం
మిజోరం,ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్,తెలంగాణ రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) నేడు ప్రకటించనుంది. పోలింగ్ తేదీలు, దశల సంఖ్య,నామినేషన్ల దాఖలు,ఉపసంహరణ తేదీలను ప్రకటించడానికి పోల్ ప్యానెల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. ఈ ఐదు రాష్ట్రాల్లోని శాసన సభల పదవీకాలం డిసెంబర్ 2023,జనవరి 2024 మధ్య ముగుస్తుంది. ECI సాధారణంగా శాసనసభ గడువు ముగియడానికి ఆరు నుండి ఎనిమిది వారాల ముందు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది.
2018లో ఒకే దశలో ఎన్నికలు
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి), ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బిజెపి అధికార పార్టీగా ఉంది. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధికారంలో ఉన్నాయి. అంతకుముందు, నవంబర్ రెండవ వారం,డిసెంబర్ మొదటి వారం మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉందని EC తెలిపింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలలో 2018లో చివరిసారిగా ఒకే దశలో ఎన్నికలు జరిగినట్లు EC వర్గాలు తెలిపాయి.
ఐదు రాష్ట్రాలకు వేర్వేరుగా పోలింగ్ తేదీలు
2018లో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు రెండు దశలలో జరిగింది. ఇప్పుడు అదే విధంగా రెండు దశల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని EC తెలిపింది. మొత్తం ఐదు రాష్ట్రాలకు పోలింగ్ తేదీలు వేర్వేరుగా ఉండవచ్చు. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఒకే రోజు జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.