Page Loader
Supreme Court:'ఈడీ అన్ని పరిమితులను దాటుతోంది'..తమిళనాడు మద్యం కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే 
తమిళనాడు మద్యం కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే

Supreme Court:'ఈడీ అన్ని పరిమితులను దాటుతోంది'..తమిళనాడు మద్యం కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే 

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నిర్వహించిన దాడులపై భారత సుప్రీంకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ వ్యవహారం "అన్ని హద్దులు మీరుతోంది" అంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం, ఇది సమాఖ్య పాలనా వ్యవస్థకు విరుద్ధమని పేర్కొంది. అలాగే, అవినీతి ఆరోపణలపై చేపట్టిన తదుపరి చర్యలను తక్షణమే నిలిపివేయాలని గురువారం ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును వేసవికాలం సెలవుల తర్వాత విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై మార్చిలో,అనంతరం గత వారంలో ఈడీ దాడులు నిర్వహించింది.

వివరాలు 

మొబైల్ ఫోన్ల లోని డేటాను క్లోన్ చేశారని కపిల్ సిబల్ కోర్టుకు నివేదన.. 

ఈ దాడులు మద్యం రవాణా, బార్ లైసెన్సుల మంజూరు, బాటిల్ తయారీ సంస్థలు, డిస్టిలరీలతో కుమ్మక్కై ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై జరిగాయి. ఈ నేపథ్యంలో, లెక్కల్లో చూపని నిధులని అర్జించారనే ఆరోపణలతో సంబంధించి దర్యాప్తు జరిగింది. ఈ దాడుల సమయంలో అనేక మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, వాటిలోని డేటాను క్లోన్ చేశారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు నివేదించారు. ఈ పరిణామంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ, "వ్యక్తులపై కేసులు నమోదు చేయవచ్చు కానీ కార్పొరేషన్లపై ఎలా కేసులు వేస్తారు? ఈడీ తన అధికార పరిమితులను మించి వ్యవహరిస్తోంది" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

వివరాలు 

బీజేపీ ప్రభుత్వంపార్టీలపై కక్ష సాధించేందుకు కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటోంది: భారతి 

ఈడీకి మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 23న ఇచ్చిన అనుమతులను సవాలు చేస్తూ, డీఎంకే పార్టీ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం, అలాగే రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ అయిన టాస్మాక్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలను డీఎంకే స్వాగతించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని అపఖ్యాతికి గురిచేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు జరిగాయని డీఎంకే నాయకుడు ఆర్.ఎస్. భారతి ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఉన్న నేతలపై, పార్టీలపై కక్ష సాధించేందుకు కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటుందనే ఆరోపణల నడుమ ఈ తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఈ విచారణలు, ఆరోపణలు తమిళనాడు రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపుతున్నాయి.