
Eknath Shinde: మహారాష్ట్ర మాజీ సీఎంకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనారోగ్యానికి గురయ్యారు.
ఆయన ఆరోగ్యం ఊహించని విధంగా క్షీణించడం రాష్ట్ర రాజకీయాలలో ఉత్కంఠను పెంచింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, షిండేను థానేలోని జూపిటర్ హాస్పిటల్‌లో చేర్చారు.
వైద్యులు ఆయనకు డెంగ్యూ, మలేరియా పరీక్షలు నిర్వహించగా, వాటి ఫలితాలు నెగటివ్‌గా వచ్చాయి.
అయితే, బాడీ వైట్ సెల్స్ తగ్గడం వల్ల చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. తీవ్రమైన జ్వరం కారణంగా ఆయన యాంటీబయాటిక్స్ వాడుతున్నారు.
వివరాలు
షిండే ఆరోగ్య పరిస్థితి ప్రమాణస్వీకారంపై ప్రభావం చూపుతుందా
శివ సైనికులు షిండే అనారోగ్యం గురించి తెలుసుకుని హాస్పిటల్‌కు తరలి వెళ్లారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మినిష్టర్ అమిత్ షా కూడా ఆయన ఆరోగ్యంపై సమాచారం తీసుకున్నారు.
షిండే అనారోగ్యం కారణంగా నిన్న రాత్రి జరగాల్సిన మహాయుతి సమావేశం వాయిదా పడింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సమావేశం రేపటికి పొడిగించబడింది.
ఈ నెల 5న బీజేపీ నేత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర పెద్దలు ప్రకటించారు.
అయితే షిండే ఆరోగ్య పరిస్థితి దీనిపై ప్రభావం చూపుతుందా? లేక కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం యథావిధిగా జరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
వివరాలు
పొత్తు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం
మరోవైపు , హోం, స్పీకర్ పదవుల విషయంలో బీజేపీ పట్టువిడవడం లేదు. శివసేన, ఎన్సీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గు చూపుతుండటంతో, అవసరమైతే బీజేపీకి ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్‌లతో పొత్తు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
బీజేపీ ఇప్పటికే 132 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉంది. మరో 13 మంది చేరితే మ్యాజిక్ ఫిగర్ దాటడం సులభమవుతుంది.
ఈ పరిణామాల మధ్య, షిండే అనారోగ్యం కారణంగా మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.