Tomato Purchase: టమాటా ధరల పతనంపై ప్రభుత్వ స్పందన - మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో టమాటా ధరలు పడిపోవడంతో, ప్రభుత్వం తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.
రైతులకు నష్టంలేకుండా చూడడానికి, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటాను ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ప్రకటించారు.
ఈ చర్యలపై సమగ్ర సమీక్ష చేపట్టేందుకు మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత, సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా, మార్కెటింగ్ శాఖ శుక్రవారం నుంచి టమాటా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో నేరుగా విక్రయించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
అవసరమైనంత మేరకు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు చేపట్టే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు.
వివరాలు
రవాణా సబ్సిడీని ఉపయోగించుకోవాలి
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని, ముఖ్యంగా రవాణా సబ్సిడీని ఉపయోగించుకోవాలని సూచించారు.
టమాటా మార్కెటింగ్ ప్రక్రియ విజయవంతంగా అమలుకావడానికి ప్రత్యేక సమన్వయంతో జిల్లా స్థాయిలో మార్కెటింగ్ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, రైతు బజార్ల అధికారులతో పాటు ఉద్యాన శాఖ అధికారులు కలిసి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రైతులకు సాగు దశ నుంచి మార్కెటింగ్ దశ వరకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
టమాటా కొనుగోళ్లపై అధికారులు తక్షణమే చర్యలు ప్రారంభించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు.