Page Loader
Viral Video: భారీ వర్షాన్ని లెక్కచేయక పంటను కాపాడుకునేందుకు రైతు ప్రయత్నం.. స్పందించిన కేంద్ర మంత్రి
భారీ వర్షాన్ని లెక్కచేయక పంటను కాపాడుకునేందుకు రైతు ప్రయత్నం.. స్పందించిన కేంద్ర మంత్రి

Viral Video: భారీ వర్షాన్ని లెక్కచేయక పంటను కాపాడుకునేందుకు రైతు ప్రయత్నం.. స్పందించిన కేంద్ర మంత్రి

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2025
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆరుగాలం శ్రమించి పండించిన పంట విలువను రైతే బాగా అర్థం చేసుకుంటాడు. అకాల వర్షాలు పడితే పంటలు తడిసి, కొట్టుకుపోయి లేదా మొలకలు వచ్చి నష్టపోవడం మనం తరచుగా చూస్తుంటాం. చేతికొచ్చిన పంట నీళ్లలో కలిసిపోతే ఆ రైతు ఎదుర్కొనే బాధను మాటల్లో చెప్పలేం. తాజాగా మహారాష్ట్రలో ఓ రైతు తన పంటను కాపాడేందుకు చేసిన ప్రయత్నం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఘటనపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. బాధిత రైతుతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

వివరాలు 

భారీ వర్షానికి నీటిలో కొట్టుకుపోయిన పంట

మహారాష్ట్రకు చెందిన రైతు గౌరవ్‌ పన్వార్‌ తన వేరుశనగ పంటను విక్రయించేందుకు వాషిమ్‌ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. అయితే అదే సమయంలో కురిసిన భారీ వర్షానికి పంట నీటిలో కొట్టుకుపోయింది. దీంతో తడుస్తున్నా ఆ రైతు వర్షంలోనే నిలబడి, తన వేరుశనగ పంటను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో హృదయాన్ని తాకేలా ఉండటంతో, ఇది సోషల్‌ మీడియాలో విస్తృతంగా పంచుకుంటూ వైరల్‌ అయ్యింది. ఈ దృశ్యం కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దృష్టికి రావడంతో, ఆయన స్వయంగా బాధిత రైతుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆపద్భాంధవులుగా తోడుంటామని ధైర్యం చెప్పారు.

వివరాలు 

మీ కుటుంబం ఇబ్బందులు పడకుండా చూస్తాం

ఈ సందర్భంగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌) ఖాతాలో ఓ పోస్టు చేశారు. ''ఈ ఘటన నన్నెంతో బాధించింది. కానీ మీరు ఆందోళన చెందకండి. మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను సున్నితంగా పరిశీలిస్తోంది. నేను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌లతో చర్చించాను. నష్టపోయిన పంటకు న్యాయం చేస్తాం. తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. మీ కుటుంబం ఇబ్బందులు పడకుండా చూస్తాం'' అని బాధిత రైతుకు భరోసా ఇచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్పందించిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌